ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఒక కోతి చేసిన పనికి తీవ్ర గందరగోళం నెలకింది. ఏకంగా రూ. 2 లక్షల నగదు ఉన్న బ్యాగును లాక్కొని, చెట్టుపైకి ఎక్కి నోట్ల వర్షం కురిపించిన ఘటన, వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
బులంద్‌షహర్ జిల్లా కోర్టు వెలుపల మే 31నఈ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఆస్తి రిజిస్ట్రేషన్ చ స్టాంప్ పేపర్ల కొనుగోలుకు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి రూ. 2 లక్షల నగదుతో కోర్టుకు వచ్చాడు. ఇంతలో ఎక్కడనుంచి వచ్చిందో ఒకకోతి హఠాత్తుగా అతని చేతిలోని డబ్బుల బ్యాగును లాక్కొని, ఎవరూ ఊహించని విధంగా పక్కనే ఉన్న వేప చెట్టుపైకి ఎక్కేసింది.
అంతటితో ఆగలేదు.. ఆగితే.. ఎలా? అందుకే కోతి చేష్టలన్నారు.. చెట్టు కొమ్మపై కూర్చున్న ఆ కోతి, బ్యాగును చింపివేసి అందులోని రూ. 500 నోట్లను గాల్లోకి విసరడం ప్రారంభించింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. గాల్లోంచి నోట్లు కిందకు రాలుతుండటంతో చెట్టు కింద ఉన్న జనం ఎగబడ్డారు. నోట్లను దక్కించుకునేందుకు కోర్టుకు వచ్చిన లాయర్లు, క్లయింట్లు, బాటసారులు అంతా ఒకేచోట చేరడంతో అక్కడ కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.
చివరికి స్థానికులు, అధికారుల సహాయంతో చాలా శ్రమించి చాలావరకు డబ్బును తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అయితే కొన్ని నోట్లు చిరిగిపోగా, మరికొంత నగదు దొరకకుండా పోయినట్లు సమాచారం. అదృష్ట వశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
ఇదీ చదవండి: వారెవ్వా! నటనలోనే కాదు, ఫార్మింగ్‌లోనూ సూపర్ స్టారే!
నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్‌లో విపరీతంగా వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ పెట్టారు. డబ్బులు చెట్లకు కాస్తాయా? అని అడిగేవారికి ఇదే సమాధానం!" అని ఒకరు కామెంట్ చేయగా, సమాజంలో ఆర్థిక సమానత్వం కోసం ఆ కోతి 'న్యాయవాది'లా పోరాడుతోంది" అని మరొకరు చమత్కరించారు. భారతీయ మార్కెట్లలో ప్రస్తుత రీటైల్ లిక్విడిటీకి ఇదొక చక్కని ఉదాహరణ. డబ్బు ప్రతిచోటా ఎగురుతోంది, కానీ ఫండమెంటల్స్ మాత్రం ఇంకా చెట్లపైనే ఊగుతున్నాయి" అని కొందరు మార్కెట్ విశ్లేషణలతో ముడిపెట్టారు.
ఇదీ చదవండి: 65 నిమిషాల్లో 10 వేల అడుగులు : పక్కా లెక్కలతో ఇలా!
Bulandshahr, UP : Monkey 🙈 snatched a bag with ₹2 Lakh , climbed on a tree and started showering cash from the top of the tree 😳 pic.twitter.com/Sy2tbz21ce
— Amitabh Chaudhary (@MithilaWaaala) June 1, 2026
కాగా ఈ ప్రాంతంలో కోతుల బెడద ఎప్పుడూ ఉండేదేనని, ఫోన్లు, ఆహార పదార్థాలను లాక్కెళ్లడం సాధారణమే అయినా, ఇంత పెద్ద మొత్తంలో డబ్బును లాక్కొని నోట్ల వర్షం కురిపించడం మాత్రం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే పెళ్లి సందడి : ఎద్దుల బండి ఊరేగింపు


