తాజా ఎన్నికల్లో పట్టు నిరూపించుకున్న నితీశ్ కుమార్
2020 అసెంబ్లీ ఫలితాలతో పోల్చితే రెట్టింపు సీట్లు
రాష్ట్ర రాజకీయాల్లో ఎదురులేదని నిరూపించుకున్న సీఎం
పట్నా: ‘టైగర్ అభీ జిందా హై’(పులి ఇంకా సజీవంగానే ఉంది) బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఇది. జేడీ(యూ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు ఈ టైటిల్ సరిగ్గా వర్తిస్తుంది. ‘నేను అలసిపోలేదు. రిటైర్ అవ్వాలనే మూడ్‌లోనూ లేను’అన్న పదాలకు నితీశ్‌కుమార్ నిలువుటద్దంలా కనిపిస్తున్నారు. ఐదేళ్ల క్రితం 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సీట్లను ప్రస్తుతం దాదాపు రెట్టింపు చేసుకున్న నితీశ్, ఆ రాష్ట్ర రాజకీయాల్లో తనకు ఎదురులేదని నిరూపించుకున్నారు.
వదంతులను పటాపంచలు చేస్తూ..
బిహార్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం మొ దలు నితీశ్ కుమార్ పలు అంశాల్లో తన సత్తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇందులో ఒకటి ‘ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది’అన్న అంశంకాగా, ‘ఆయన ఆరోగ్యం సరిగా లేదు’అన్నది మరొకటి. ఈ రెండు అంశాలను ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షం ఉధృతంగా ప్రజల్లోకి తీసుకునివెళ్లింది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన సమర్థంగా ఎదుర్కొన్న ట్లు తాజా ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి.
పథకాల ప్రకటనలో దూకుడు
అత్యంత కీలకమైన ఈ ఎన్నికలకు ముందుగా, 75 ఏళ్ల నితీశ్ దూకుడుగా పథకాలు ప్రకటించారు. సామాజిక భద్రతా పెన్షన్లు పెంచడం, జీవికా –ఆశా– ఆంగన్‌వాడీ సిబ్బందికి భత్యాలు ఇవ్వడం ఇందులో కొన్ని. అంతేకాదు ఎంతో ప్రచారం పొందిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్ యోజన’కింద కోటి మందికిపైగా మహిళల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జమ చేసి ప్రజాకర్షక పథకాల్లో దూసుకుపోయారు. అయితే ఈ ‘‘ఫ్రీబీలు’’ప్రభావాన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులు ముందుగానే గమనించారు.
ఆయన మాజీ డిప్యూటీ తేజస్వి యాదవ్ (ఆర్జేడీ) ప్రభుత్వం ‘కాపీక్యాట్’గా మారిందని విమర్శించారు. నితీశ్‌కు గతంలో సహాయకునిగా వ్యవహరించిన పవన్ వర్మ ‘ఈ పథకాల ద్వారా ఓటర్లను లంచం ఇస్తున్నారు’అని విమర్శించారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు. ప్రస్తుతం పవన్ వర్శ.. జేడీయూ సుప్రీమోకు ఒకప్పడు సన్నిహితునిగా ఉన్న ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని జన సురాజ్ పార్టీలో (జేఎస్‌పీ) ఉన్నారు. ఇక రాష్ట్ర ఖజానాను దెబ్బతీస్తున్నారన్న విమర్శలు సరేసరి.
తొణకని, బెణకని నైజం
అయితే రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ కాలం సీఎం గా పనిచేసిన నితీశ్ కుమార్ మాత్రం విమర్శలు, ఆరోపణలకు ఏమాత్రం కంగారు పడలేదు. బీజేపీ తనపై ‘మహారాష్ట్ర శిండే విధానం’అవలంబించబోతుందన్న ప్రత్యర్థుల మాటలకూ విలువ ఇవ్వలేదు. మహారాష్ట్రలో శివసేనను అధిగమించి బీజేపీ అధికారం చేపట్టిన తరహాలోనే, నితీశ్‌కూ బీజీపీ రాజకీయంగా భంగం కలిగిస్తుందన్న అర్థంలో ప్రతిపక్షాలు చేసిన విమర్శలకూ ఆయన విలువ ఇవ్వలేదు. అయితే ఈ విమర్శలకు ఆయన ఎందుకు తొణకడంలేదన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.
లోక్‌సభలో స్వతంత్ర మెజారిటీ లేనందున.. బీజేపీ కేంద్రంలో అధికారంలో నిలవడానికి జేడీయూ మద్దతుపైనే ఆధారపడి ఉందన్న నిజం బహుశా ఆయన దృష్టిలో ఉండవచ్చన్నది ఇందులో ఒకటి. ఇక ఈ సందర్భంలో బీజేపీ విషయానికి వస్తే, రాష్ట్రంలో మోదీ 14 భారీ సభలు, ఒక రోడ్‌షో నిర్వహించారు. అయితే నితీశ్ కుమార్‌తో సమస్తీపూర్‌లో జరిగిన తొలి ఎన్నికల సభ మినహా వీరిరువురూ ఒకే వేదికపై ఎక్కడా కనిపించలేదు. అయినా, ‘నితీశ్ బాబు చేసిన మంచి పనిని గుర్తుంచుకోండి’అని ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రతి సభలో పేర్కొన్నారు.
రాజకీయ ప్రస్థానం..
→ బిహార్‌లోని బఖ్తియార్పూర్‌లో 1951లో జ న్మించిన కుమార్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్.
→ విద్యుత్ శాఖలో వచి్చన ఉద్యోగాన్ని వదిలి జెపీ ఉద్యమం కాలంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు.
→ జనతా పార్టీలో చేరి 1977లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేశారు కానీ ఓడిపోయారు. 1985లో తొలి విజయాన్ని సాధించారు.
→ దాదాపు ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో తరచూ పక్షం–విపక్షం మారుతూ వచ్చారన్న విమర్శలతో ‘పల్టూ రాం’ (పల్టీ రాం) అన్న బిరుదు కూడా సంపాదించారు.


