భూతద్దంతో వెదికినా అవి కనిపించరాదు
మహారాష్ట్ర బీజేపీ శ్రేణులకు అమిత్ షా పిలుపు
ముంబై: త్వరలో మహారాష్ట్రలోని స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలని బీజేపీ శ్రేణులకు హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. అందరం కష్టించి పనిచేసి, ప్రతిపక్ష పారీ్టల ప్రాతినిథ్యం బూతద్దంతో వెదికినా కనిపించని స్థాయికి తగ్గించాలన్నారు. దక్షిణ ముంబైలోని చర్చ్‌గేట్ రైల్వే స్టేషన్ వద్ద బీజేపీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిపిన అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలో బీజేపీకి సొంతంగానే పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఊతకర్రలపై ఆధారపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
‘దేశంలో కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందనే విషయాన్ని మనం నిరూపించి చూపాం. పనితీరు, ప్రతిభ ఆధారంగా చేసే రాజకీయాల వల్లే దేశం ప్రగతిబాటన పయనిస్తుంది. ఇందుకు మన ప్రధాని నరేంద్ర మోదీయే చక్కని ఉదాహరణ’అని అమిత్ షా తెలిపారు. నిరుపేద టీ దుకాణం యజమాని ఇంట్లో పుట్టిన మోదీ..అంకితభావం, త్యాగశీలత, కష్టించే తత్వంతోనే భారత ప్రధాని స్థాయికి ఎదిగారన్నారు.
మోదీ సారథ్యంలో బీజేపీ సైద్ధాంతిక పరమైన హామీలు..ఆరి్టకల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, పౌరసత్వ సవరణ చట్టం, ట్రిపుల్ తలాక్ వంటి వాటిని అమల్లోకి తెచి్చందన్నారు. ఇందులో భాగమైన ఉమ్మడి పౌరస్మృతిని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ఇప్పుడిక 2047నాటికి వికసిత్ భారత్ అనే కల సాకారానికి నడుం బిగించిందని అమిత్ షా వివరించారు. అనంతరం సీఎం ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. అమిత్ షా చేసిన ఊతకర్రలనే వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. స్నేహితులను ఊతకర్రలుగా భావించడం లేదన్నారు. అమిత్ షా వ్యాఖ్యలకు అర్థం తెలియని వారికే ఇలాంటి సందేహాలు వస్తాయన్నారు.


