ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్‌డీఏకు 321 సీట్లు!

NDA likely to win 321 seats if elections are held today - Sakshi

మళ్లీ ఎన్‌డీఏనే.. మళ్లీ మోదీనే!

సవాళ్లు ఎన్నున్నా అధికార కూటమికి తగ్గని ప్రజాదరణ

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 321 సీట్లు గెల్చుకుంటుంది

‘ఇండియా టుడే – కార్వీ’ మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వే

న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల్లో చైనా, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు, దేశవ్యాప్తంగా కరోనా, అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థ.. ఇలా అసాధారణ వరుస సవాళ్లను ఎదుర్కొన్న ఏ ప్రభుత్వ ప్రజాదరణ అయినా సహజంగానే తగ్గుముఖం పడుతుంది. కానీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ ప్రజాదరణ మాత్రం ఈ అసాధారణ సవాళ్లలోనూ చెక్కు చెదరలేదని,  ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఎన్‌డీఏ ఘన విజయం సాధిస్తుందని ‘ఇండియా టుడే –కార్వీ’ జరిపిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌(ఎంఓటీఎన్‌)’ సర్వే తేల్చింది. మెజారిటీ మార్క్‌ను దాటి 43% ఓట్లతో 321 స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుందని తేల్చింది. గత సంవత్సరం ఆగస్ట్‌ నెలలో జరిపిన సర్వేలో ఎన్‌డీఏ 316 సీట్లు గెలుచుకుంటుందని తేలగా, దానిపై మరో ఐదు స్థానాలు అధికంగానే గెలుస్తుందని ప్రస్తుత సర్వే పేర్కొనడం విశేషం.

అయితే, 2019 ఎన్నికల్లో ఎన్‌డీఏ గెల్చుకున్న 357 సీట్ల కన్నా ఈ నెంబర్‌ తక్కువగానే ఉండటం గమనార్హం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విపక్ష యూపీఏ కూటమి 93 సీట్లు గెల్చుకుంటుందని ఈ ఎంఓటీఎన్‌ సర్వే పేర్కొంది. ప్రాంతాల వారీగా తీసుకుంటే, హిందీ, హిందుత్వ రాజకీయాలు బలంగా ఉన్న ఉత్తర భారతదేశంలో ఎన్‌డీఏ అత్యధికంగా 104 సీట్లను, పశ్చిమ భారతదేశంలో 85 సీట్లను, తెలివైన పొత్తులతో తూర్పు భారతంలో 100 స్థానాలను  గెల్చుకుంటుందని ఈ సర్వే తేల్చింది. దక్షిణ భారత్‌లో మాత్రం ఆశించిన ఫలితాలను సాధించలేదని, అక్కడ 32 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది. పార్టీల వారీగా చూస్తే బీజేపీ మరొకసారి సొంతంగా మెజారిటీ సాధిస్తుందని, మెజారిటీ మార్క్‌ అయిన 272ని దాటి 291 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. కాంగ్రెస్‌ 51 సీట్లు మాత్రమే సాధిస్తుందంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 52 సీట్లు  గెల్చుకున్న విషయం తెలిసిందే.

మోదీపై విశ్వాసం
కరోనాపై పోరుకు అనూహ్య లాక్‌డౌన్‌ ప్రకటన, కరోనా కేసుల్లో ప్రపంచంలో రెండోస్థానంలో నిలవడం, వలస కూలీల సంక్షోభం, కనిష్ట స్థాయికి జీడీపీ, ప్రబలిన నిరుద్యోగం, లద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనా దూకుడు.. తదితర అంశాల్లో విమర్శలు వచ్చినప్పటికీ.. ప్రధాని మోదీపై ప్రజల విశ్వాసం సడలలేదని సర్వేలో తేలింది. ఎంఓటీఎన్‌ సర్వేలో పాల్గొన్నవారిలో 74% మంది మోదీ ప్రధానిగా అత్యుత్తమ పనితీరు చూపారని ప్రశంసించారు. వరుసగా ఏడో సంవత్సరం అధికారంలో ఉన్న నేతకు ఈ స్థాయిలో ప్రజాదరణ లభించడం అరుదైన విషయమే. అలాగే, ఎన్‌డీఏ ప్రభుత్వ పనితీరుపై 66% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యుత్తమ ప్రధాని రేసులోనూ మోదీ చాలా ముందున్నారు. దేశ అత్యుత్తమ ప్రధానిగా 38% రేటింగ్‌తో మోదీ తొలి స్థానంలో నిలిచారు. తరువాతి స్థానాల్లో వరుసగా అటల్‌ బిహారీ వాజ్‌పేయి(18%), ఇందిరాగాంధీ(11%), జవహర్‌లాల్‌ నెహ్రూ(8%), మన్మోహన్‌ సింగ్‌(7%) ఉన్నారు. అయితే, దక్షిణ భారత్‌లో మోదీ హవా, బీజేపీ ప్రభావం అంతగా కనిపించలేదు. ప్రధానిగా మోదీ పాపులారిటీ దక్షిణ భారతదేశంలో 63 శాతం ఉంది. ముస్లింలలో 38% మోదీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం సాధించిన రెండు గొప్ప విజయాలుగా సర్వే తేల్చినవి ఆరెస్సెస్‌ అజెండాకే సంబంధించినవి కావడం విశేషం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top