బీజేపీ, పట్టాలి మక్కల్ కట్చి, ఏఎంఎంకేలకు కలిపి 56 సీట్లు
ఇందులో బీజేపీకి 27, పీఎంకేకి 18, ఏఎంఎంకేకు 11
ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకేతో ఈ మేరకు కుదిరిన ఒప్పందం
చెన్నై: తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23వ తేదీన జరిగే ఎన్నికలకు ఏఐఏడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నడుమ సీట్ల పంపిణీ దాదాపు ఖరారైంది. బీజేపీ సహా భాగస్వామ్య పార్టీలకు 56 సీట్లను కేటాయించేందుకు ఇచ్చేందుకు పళని స్వామి సారథ్యంలోని ఏఐఏడీఎంకే అంగీకరించింది. దీని ప్రకారం..బీజేపీ 27, పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) 18, ఏఎంఎంకే 11 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపనున్నాయి.
ఏఐఏడీఎంకే ఎన్ని స్థానాల్లో పోటీ చేసేదీ త్వరలోనే ప్రకటిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పళనిస్వామి తెలిపారు. మరికొన్ని భాగస్వామ్య పార్టీలతో సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. సోమవారం ఏఐఏడీఎంకే ప్రధాన కార్యాలయంలో బీజేపీ నేత పీయూష్ గోయల్, పీఎంకే నేత అన్బుమణి రాందాస్, ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్‌లతో కలిసి పళనిస్వామి మీడియాతో మాట్లాడారు.
సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తమ పార్టీ ఏఐఏడీఎంకే పోటీ చేసే సీట్ల సంఖ్యపైనా త్వరలో స్పష్టత వస్తుందని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ సారథ్యంలోని తమిళ మానిల కాంగ్రెస్(మూపనార్), ఇందియ జననాయగ కట్చి(ఐజేకే)లతో సంప్రదింపులు కొనసాగుతున్నాయన్న పళనిస్వామి..ఆయా పార్టీలతో త్వరలోనే ఒప్పందం ఖరారవుతుందని స్పష్టం చేశారు. 234 సీట్లకు గాను తమ కూటమి కనీసం 210 చోట్ల గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


