లోక్‌సభలో వీగిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు
352 ఓట్లు కావాల్సి ఉండగా అనుకూలంగా 298 ఓట్లే
బిల్లును వ్యతిరేకిస్తూ ఓటేసిన 230 మంది విపక్ష సభ్యులు
మూడింట రెండొంతుల మెజారిటీ సాధనలో మోదీ సర్కారు విఫలం
సవరణతో పాటు మిగతా రెండు బిల్లుల ఉపసంహరణ
మోదీ హయాంలో ఓ బిల్లు వీగిపోవడం ఇదే తొలిసారి
మహిళా చట్టం అమలుకు కృషి చేస్తూనే ఉంటాం: కేంద్రం
బీజేపీ డీలిమిటేషన్ కుట్రలను ఓడించామన్న విపక్షాలు
వాటి తీరును నిరసిస్తూ బీజేపీ మహిళా ఎంపీల ధర్నా
న్యూఢిల్లీ: మోదీ సర్కారుకు పార్లమెంటులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేందుకు, లోక్‌సభ స్థానాల సంఖ్యను 816 పెంచేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. ముందునుంచీ ఊహించినట్టుగానే బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని అధికార పక్షం సాధించలేకపోయింది. శుక్రవారం సాయంత్రం లోక్‌సభలో చేపట్టిన కీలక ఓటింగ్‌లో మొత్తం 540 మంది సభ్యులకు గాను 528 మంది పాల్గొన్నారు.
బిల్లు ఆమోదానికి 352 ఓట్లు రావాల్సి ఉండగా 298 మంది మాత్రమే అనుకూలంగా ఓటేశారు. 230 మంది విపక్ష సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో సవరణ బిల్లు వీగిపోయినట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. దానితో పాటుగా ప్రవేశపెట్టిన డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను కూడా వెనక్కు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.
ఆ రెండు బిల్లులూ రాజ్యాంగ సవరణ బిల్లుతోనే ముడిపడి ఉన్నందున వాటిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో పార్లమెంటులో ఒక బిల్లు వీగిపోవడం ఇదే తొలిసారి! ఈ నేపథ్యంలో మోదీ సర్కారు లోక్‌సభ స్థానాల పెంపు యత్నాలకు తాత్కాలికంగా తెర పడినట్టే. సవరణ బిల్లువీగిపోయినంత మాత్రాన నిరాశ చెందబోమని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల సత్వర అమలుకు తమ ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంటుందని రిజిజు పేర్కొన్నారు.
కాంగ్రెస్, తృణమూల్, సమాజ్‌వాదీ, డీఎంకే తదితర పక్షాలు ఎంతటి మహిళా వ్యతిరేకులో ఈ ఉదంతం మరోసారి రుజువు చేసిందంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు దుయ్యబట్టారు. మహిళా బిల్లు ముసుగులో స్వీయ రాజకీయ లబ్ధి కోసం లోక్‌సభ నియోజకవర్గాలను పెంచుకోవాలన్న బీజేపీ కుట్రలకు అడ్డుకట్ట పడిందని కాంగ్రెస్ తదితర పార్టీలు చెప్పుకొచ్చాయి. 2029 లోక్‌సభ ఎన్నికల్లోనే గాక దేశవ్యాప్తంగా ఇకపై జరగబోయే అన్ని ఎన్నికల్లోనూ విపక్షాలు మహిళల ఆగ్రహ జ్వాలలను చవిచూడక తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు.
సవరణ బిల్లును విపక్షాలు ఓడించడాన్ని బీజేపీ మహిళా ఎంపీలు తీవ్రంగా నిరసించారు. శుక్రవారం సాయంత్రం లోక్‌సభ వాయిదా పడ్డ అనంతరం పార్లమెంటు ఆవరణలో వారు ధర్నాకు దిగారు. ‘మహిళలకు జరిగిన అవమానాన్ని భారత్ సహించబోదు’ అంటూ ప్లకార్డులు చేబూని నినాదాలు చేశారు. కేంద్ర మంత్రులు శోభా కరంద్లాజె, అన్నపూర్ణా దేవి, రక్షా ఖడ్సే, ఎంపీ కంగనా రనౌత్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.

విపక్షాల తీరును నిరసిస్తూ బీజేపీ మహిళా ఎంపీల నినాదాలు
పార్లమెంటు ప్రత్యేక భేటీ
మహిళా రిజర్వేషన్ల సత్వర అమలుకు వీలుగా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ చట్టానికి మోదీ సర్కారు కీలక సవరణలు చేపట్టింది. అందుకోసం రూపొందించిన మూడు బిల్లుల ఆమోదానికి పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచింది. రాజ్యాంగ (131వ సవరణ), డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట (సవరణ) బిల్లులను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేయాలని, అందుకోసం లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి 816కు పెంచాలని, అందుకు 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని రాజ్యాంగ సవరణ బిల్లులో కీలక ప్రతిపాదనలు చేసింది.
మూడు బిల్లులపై గురువారం నుంచి శుక్రవారం సాయంత్రం దాకా లోక్‌సభలో 18 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ జరిగింది. 130 మందికి పైగా ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును సభ ఓటింగ్‌కు చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు విపక్ష నేత రాహుల్‌గాంధీ కూడా సభలో ఉన్నారు. బిల్లు వీగిన అనంతరం రిజిజు మాట్లాడుతూ ఇది పూర్తిగా విపక్షాల పాపమేనన్నారు. దేశ మహిళలను గొప్పగా గౌరవించుకునే సువర్ణావకాశాన్ని అవి కోల్పోయాయంటూ ఆక్షేపించారు.

‘‘కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి. దేశ మహిళలు ఆ పార్టీని ఎప్పటికీ క్షమించరు’’ అంటూ దుయ్యబట్టారు. మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేదాకా తమ ప్రభుత్వం విశ్రమించబోదని మంత్రి చెప్పారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచే బిల్లును ఓడించి కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలు సంబరాలు చేసుకోవడం దారుణమని అమిత్ షా ఆక్షేపించారు. మహిళల పట్ల వారి వివక్షకు ఇది అద్దం పట్టిందన్నారు. రాజ్యాంగంపై మోదీ సర్కారు తలపెట్టిన దాడిని మాత్రమే తాము ఓడించామని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు.
ఎన్డీఏకు ‘ఐదు’ అదనం ‘ఇండియా’కు 3 తక్కువ
మహిళా చట్ట సవరణ బిల్లుపై చేపట్టిన ఓటింగ్‌లో అధికార ఎన్డీఏ కూటమికి దాని పూర్తి బలం కంటే 5 ఓట్లు అదనంగా రావడం విశేషం. అదే సమయంలో విపక్ష ఇండియా కూటమికి మొత్తం బలం కంటే 3 ఓట్లు తగ్గాయి. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలన్నింటికీ కలిపి 293 మంది, ఇండియా కూటమి పార్టీల్లో 233 మంది ఎంపీలున్నారు. అయితే ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లొచ్చాయి. వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి.


