మావోయిస్టులను నిద్రపోనివ్వను | Maoists wonot sleep peacefully this monsoon says Amit shah | Sakshi
Sakshi News home page

మావోయిస్టులను నిద్రపోనివ్వను

Jun 23 2025 4:37 AM | Updated on Jun 23 2025 4:37 AM

Maoists wonot sleep peacefully this monsoon says Amit shah

వర్షాకాలంలోనూ కేంద్ర ఆపరేషన్‌ కొనసాగుతుంది 

హోంమంత్రి అమిత్‌ షా హెచ్చరిక

రాయ్‌పూర్‌: మావోయిస్టులు సాధారణగా వర్షాకాలంలో విశ్రాంతి తీసుకుంటారని, కానీ ఈ వర్షాకాలంలో కూడా మావోయిస్టులను నిద్రపోనివ్వనని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. వర్షాకాలంలో కూడా ప్రభుత్వ ఆపరేషన్‌ కొనసాగుతుందని హెచ్చరించారు. చర్చల ప్రసక్తే లేదన్న మంత్రి.. అడవుల్లో ఉన్న మావోయిస్టులంతా ఆయుధాలు వదిలి జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని, అభివృద్ధికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. 

చత్తీస్‌గఢ్‌లోని నవా రాయ్‌పూర్‌ అటల్‌ నగర్‌లో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ(ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ)కి ఆదివారం మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే సెజ్‌బహార్‌లోని ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ ట్రాన్సిట్‌ క్యాంపస్‌ను, ఛత్తీస్‌గఢ్‌లోని ఐ–హబ్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం షా మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చి చివరికల్లా నక్సలిజాన్ని అంతం చేస్తామని పునరుద్ఘాటించారు. 

ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను కూడా అమలు చేస్తామన్నారు. అవసరమైతే అంతకన్న ఎక్కువ సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియంలను పూర్తిగా అమలుతో మన దేశ నేర న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునిక, వేగవంతమైన, శాస్త్రీయ న్యాయ వ్యవస్థగా మారుతుందని షా అన్నారు. 

నవ రాయ్‌పూర్‌లోని ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ క్యాంపస్‌కు రూ. 145 కోట్లు, సీఎఫ్‌ఎస్‌ల్‌కు రూ. 123 కోట్లు ఖర్చవుతుందని, ఇవి మూడు సంవత్సరాలలో అందుబాటులోకి వస్తాయన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక, ఆర్థిక పురోగతిపైనే కాకుండా సకాలంలో న్యాయం అందించడంపైనా దృష్టి పెడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌ సాయి, ఉప ముఖ్యమంత్రులు అరుణ్‌ సావో, విజయ్‌ శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement