
న్యూఢిల్లీ: మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటనపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం ఐదు గంటలు కూడా ఆయన మణిపూర్ ప్రజలతో గడపలేకపోయారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో వర్గవైషమ్యాలతో రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్న వారిని ఈ పర్యటనతో మోదీ ఘోరంగా అవమానించారన్నారు. మోదీ పర్యటనను ఆయన పిట్ స్టాప్‌గా అభివరి్ణంచారు. ‘రెండేళ్లకుపైగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనల్లో సుమారు 300 మంది చనిపోగా, 1,500 మంది గాయపడ్డారు. మరో 67 వేల మంది నిరాశ్రయులయ్యారు.
ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు అటువైపు కన్నెత్తి కూడా చూడని ప్రధాని మోదీ ఇప్పుడు హడావుడిగా ఇంఫాల్ నుంచి చురాచాంద్‌పూర్ వరకు రోడ్ షో చేపట్టడమేంటి?’అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. సహాయ శిబిరాల్లోని ప్రజల మొర ఆలకించకుండా పిరికితనంతో తప్పించుకోవడానికే మోదీ షో చేపట్టారని ఎక్స్‌లో ఖర్గే వ్యాఖ్యానించారు. పర్యటనకు వెళ్లిన మోదీ ఘనమైన స్వాగత కార్యక్రమాలను ఏర్పాటు చేయించుకోవడం బాధితుల గాయాలను మరింతగా పెంచడమేనన్నారు. ఇలాంటి చర్యలతో మోదీలో పశ్చాత్తాపం గానీ, అపరాధ భావన కానీ లేవని వెల్లడవుతోందన్నారు. మణిపూర్‌లో అశాంతి కొనసాగుతున్న గత 864 రోజుల సమయంలో 46 విదేశీ పర్యటనలు చేసిన మోదీకి, మన పౌరులతో రెండు సానుభూతి మాటలు పంచుకునే తీరికే దొరకలేదా అని ప్రశ్నించారు.
మణిపూర్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అసమర్థత బయటపడిందన్నారు. దీన్నుంచి తప్పించుకునేందుకు మాత్రమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారని ఖర్గే ఆరోపించారు. మీ రాజ్యధర్మం ఎక్కడికి పోయిందంటూ 2002లో మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయి అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖర్గే ప్రస్తావించారు. ఇలా ఉండగా, 28 నెలలుగా ఎదురుచూస్తున్న మణిపూర్ ప్రజలతో ప్రధాని మోదీ కనీసం ఐదు గంటలైనా గడపలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ప్రచారానికి, విదేశాల్లో పర్యటనలకు ఉన్న సమయం ప్రజల మధ్య గడిపేందుకు ఆయనకు దొరకలేదా అని నిలదీశారు.