
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రాజా రఘువంశీ హత్య కేసులో అరెస్టయిన అతని భార్య సోనమ్ రఘువంశీ(24) మళ్లీ వార్తల్లో నిలిచారు. మేఘాలయలో హనీమూన్ సందర్భంగా భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్ రఘువంశీ దిష్టిబొమ్మను దసరా రోజున దహనం చేయకుండా చూడాలని మధ్యప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సోనమ్ రఘువంశీ తల్లి దసరా రోజున తన కుమార్తె దిష్టిబొమ్మను దహనం చేయకుండా చూడాలని, ఈ తరహా బహిరంగ అవమానకర చర్యలకు ఎవరూ పాల్పడకుండా ఆపాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. పిటిషనర్ తన కుటుంబంపై చట్టవిరుద్ధమైన లేదా రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు జరగకుండా చూడాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ప్రణయ్ వర్మ మాట్లాడుతూ.. పిటిషనర్ దాఖలు చేసిన అభ్యర్థన చూస్తుంటే.. విజయదశమి నాడు రావణుని దిష్టిబొమ్మకు బదులుగా పిటిషనర్ కుమార్తె దిష్టిబొమ్మను దహనం చేయాలని ఎవరో ప్రతిపాదించినట్లు స్పష్టంగా తెలుస్తున్నదన్నారు. అయితే అది సరికాదని, అలా చేయడం భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో పూర్తిగా ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు.
పిటిషనర్ కుమార్తె ఒక క్రిమినల్ కేసులో నిందితురాలిగా ఉన్నప్పటికీ, ఆమె దిష్టిబొమ్మ దహనానికి అనుమతినివ్వబోము. ఇది ఖచ్చితంగా పిటిషనర్‌తో పాటు ఆమె కుమార్తె, కుటుంబ సభ్యుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లవుతుందని జస్టిస్ ప్రణయ్ వర్మ అన్నారు. అలాగే రావణుడి దిష్టిబొమ్మ స్థానంలో ఎవరైనా పిటిషనర్ కుమార్తె లేదా మరే ఇతర వ్యక్తి దిష్టిబొమ్మను దహనం చేయకుండా చూసుకోవాలని కోర్టు రాష్ట్ర అధికారులను కోర్టు ఆదేశించింది. ఇటువంటి చర్యలు చట్ట నియమాలకు విరుద్ధమని, ఇది పిటిషనర్ కుటుంబపు ప్రతిష్టను శాశ్వతంగా దెబ్బతీస్తుందని కోర్టు పేర్కొంది.