
తమిళనాడు కరూర్‌లో సినీ నటుడు విజయ్ రాజకీయ ప్రచార ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ అంశం గురించి సినీ నటులు రజనీకాంత్, కమల్‌హాసన్ స్పందించారు. ఈ ఘటనలో ఇప్పటికే 40 మంది మరణించగా.. 60 మందికి పైగానే తీవ్రంగా గాయపడ్డారు. విజయ్ మాట్లాడుతున్న సమయంలో ఆభిమానులు ఒక్కసారిగా ఆయన దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతోనే తొక్కిసలాట జరిగినట్లు విచారణలో తేలింది. వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు రావాల్సిన విజయ్ పలు కారణాల వల్ల రాలేకపోయారు. సుమారు ఆరు గంటలు ఆలస్యంగా కరూర్‌కు ఆయన చేరుకున్నాడు. దీంతో ఎవరూ ఊహించిన విధంగా జనాలు గుమికూడారు. ఇలా అనేక కారణాల వల్ల ఈ తొక్కిసలాట జరిగింది.

విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట గురించి రాజ్యసభ సభ్యులు, నటుడు కమల్ హాసన్ ఇలా స్పందించారు 'కరూర్‌లో ఇంతమంది చనిపోయారని తెలిశాక నా గుండె వణికిపోయింది. అక్కడి నుండి వస్తున్న వార్తలు తెలుసుకుంటుంటే షాక్ అవుతున్నాను. అవన్నీ నాలో దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. తొక్కిసలాటలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలకు సానుభూతి చెప్పేందుకు కూడా నాకు మాటలు రావడం లేదు. గాయాలతో చికిత్స పొందుతున్న వారికి సరైన సహాయం అందేలా ప్రభుత్వమే చూడాలి. మరణించిన వారి కుటుంబ సభ్యలను తమిళనాడు ప్రభుత్వం ఆదుకోవాలి.' అని ఆయన కోరారు.
'కరూర్ సంఘటనలో చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త నా హృదయాన్ని కలచివేసింది. నాకు తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తోంది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. ఇలాంటి సమయంలో భగవంతుడు అండగా నిలివాలని కోరుతున్నాను.' - రజనీకాంత్
'ర్యాలీలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాట నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎవరూ భర్తి చేయలేని నష్టాన్ని అనుభవిస్తున్న ఆ కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి.' -చిరంజీవి