Maharashtra: ఠాక్రే వర్గానికి మరో భారీ షాక్‌..

Loyalist of Uddhav Thackeray Joined CM Eknath Shinde Side - Sakshi

సాక్షి, ముంబై: విధాన్‌ పరిషత్‌లో ప్రతిపక్ష నేత అంబాదాస్‌ దానవేకు అత్యంత సన్నిహితుడు, ఉద్ధవ్‌ ఠాక్రేకు నమ్మకమైన కార్యకర్త విశ్వనాథ్‌ రాజ్‌పుత్‌ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గంలో చేరారు. శిందే వర్గంలో చేరిన వారిలో ఔరంగాబాద్‌కు చెందిన విశ్వనాథ్‌తోపాటు ఎమ్మెన్నెస్, ఉద్ధవ్‌ వర్గానికి చెందిన పలువురు సీనియర్‌ పదాధికారులు, కార్యకర్తలు ఉన్నారు. వీరందరికీ గురువారం ముంబైలో శిందే స్వాగతం పలికారు.

కాగా విశ్వనాథ్‌ చేరికతో ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి గట్టిదెబ్బ తగిలినట్‌లైంది. త్వరలో ఔరంగాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్, ఇతర స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కీలక కార్యకర్తగా పేరున్న విశ్వనాథ్‌ ఆకస్మాత్తుగా శిందే వర్గంలో చేరడం జీర్ణించుకోలేక పోతున్నారు. విశ్వనాథ్‌తోపాటు ఎమ్మెన్నెస్‌ విద్యార్ధి సేన మాజీ జిల్లా అధ్యక్షుడు అమోల్‌ ఖడ్సే, మరికొందరు ఉద్ధవ్‌ వర్గం కార్యకర్తలు శిందే వర్గంలో చేరారు.

ఇదివరకే 50 మంది ఎమ్మెల్యేలతో ఉద్ధవ్‌ ఠాక్రేపై శిందే తిరుగుబాటు చేయడంతో ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి శిందే అనేక మంది శివసేన పదాధికారులను, కార్యకర్తలను తమవైపు లాక్కోవడంలో సఫలీకృతమైతున్నారు. ఇప్పటికే వేలాది మంది ఉద్ధవ్‌ వర్గం కార్యకర్తలు శిందే వర్గంలో చేరారు. తాజాగా ఏకంగా ప్రతిపక్ష నేత అంబాదాస్‌ దానవేకు అతి సన్నిహితుడైన విశ్వనాథ్‌ శిందే వర్గంలో చేరడం చర్చనీయంశమైంది.

కట్టర్‌ శివసైనికుడిగా ఉన్న విశ్వనాథ్‌ భార్య ప్రాజక్త రాజ్‌పుత్‌ మాజీ కార్పొరేటర్‌గా ఉన్నారు. 2010లో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో విల్లు–బాణం గుర్తుపై పోటీ చేసి విజయఢంకా మోగించారు. ప్రస్తుతం ఆమె పట్టణ మహిళా ఆఘాడిలో కీలక పదవిలో కొనసాగుతున్నారు. వరుసగా ఒకరి తర్వాత మరొకరు శిందే వర్గంలో చేరడంతో ఉద్ధవ్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top