కోల్‌కత్తా: లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మాజీ తృణముల్ కాంగ్రెస్ నాయకుడు సహా మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగాల్‌లోని కుల్తీ అసెంబ్లీ నియోజకవర్గంలోని లఖియాబాద్ అప్పర్ పారా ప్రాంతంలో కార్తీక్ బౌరి కుటుంబం నివసిస్తోంది. ఈ మధ్యే కార్తీక్ బౌరికి కోటి రూపాయల లాటరీ తగిలింది. ఇంతలోనే అతడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో, కార్తీక్ బౌరి తల్లి పోలీసులను ఆశ్రయించింది. తన ఫిర్యాదులో మాజీ టీఎంసీ నాయకుడు బేబీ బౌరి, అమర్‌దీప్ బౌరి, సందీప్ బౌరి, జ్యోత్స్న బౌరిలే కార్తీక్‌ను హత్య చేసినట్లు ఆరోపించారు.
అక్కడ మృతదేహాం..
కార్తీక్ బౌరి అచేతనంగా బేబీ బౌరి ఇంటి బయట ఉన్న మెట్లపై కనిపించాడు. అనంతరం, అతడి కుటుంబం అక్కడికి చేరుకుని వెంటనే కార్తీక్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే కార్తీక్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో బేబీ బౌరిని కార్తీక్ కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. కార్తీక్ తన ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నించాడని తెలిపారు. దొంగతనానికి వచ్చి ఇంటి గోడ దూకి పారిపోతుండగా కిందపడి మృతి చెందినట్టు చెప్పుకొచ్చాడు.
అయితే, బేబీ బౌరి వ్యాఖ్యలను కార్తిక్ తల్లి తిరస్కరించింది. ఇటీవలే తన కొడుకు లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నాడని, దొంగతనం చేయడానికి ఎటువంటి కారణం లేదని చెప్పింది. కార్తీక్‌ను ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్టు ఆరోపించారు. దీంతో, కార్తీక్ మృతి కేసులో మాజీ తృణమూల్ నాయకుడు బేబీ బౌరి, అమర్‌దీప్ బౌరిలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మిగిలిన ఇద్దరు నిందితులు సందీప్ బౌరి, జ్యోత్స్న బౌరి పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు. అరెస్టు చేసిన ఇద్దరినీ అసన్సోల్ కోర్టు ముందు హాజరుపరిచినట్టు వెల్లడించారు.


