
సాక్షి,న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై కాల్పుల ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిశాపఠానీ ఇంటిపైకి కాల్పులకు తెగబడ్డ నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ప్రముఖ అంతర్జాతీయ నేరస్థుల ముఠా సభ్యులైన ఈ ఇద్దరిని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.
సెప్టెంబర్ 12న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ నగర సివిల్ లైన్స్ ఏరియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆ రోజు తెల్లవారు జామున సరిగ్గా 3.45 నిమిషాలకు గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా ముఠాకు చెందిన రవీంద్ర, అరుణ్‌లు ఈ కాల్పులు జరిపారు. అయితే, ఈ కాల్పుల ఘటనను యూపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నిందితులు ఎక్కడున్నా వారిని పట్టుకుని తీరుతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు.
ఆ మరుసటి రోజే ఘాజియాబాద్‌లోని ట్రోనికా సిటీలో ఎస్టీఎఫ్ నోయిడా యూనిట్, ఢిల్లీ పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. సంఘటనా స్థలం నుంచి తుపాకీ,బుల్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు లా అండ్ ఆర్డర్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఎడిజి) అమితాబ్ యష్ తెలిపారు.
ఇటీవల,దిశా పటానీ సోదరి,మాజీ ఆర్మీ అధికారిణి ఖుష్బూ పటానీ ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారనే కారణంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని గోల్డీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించింది.