కూటముల కోలాటం | Kerala semi-final verdict has put Left on red alert ahead of April 9 polls | Sakshi
Sakshi News home page

కూటముల కోలాటం

Mar 22 2026 5:18 AM | Updated on Mar 22 2026 6:12 AM

Kerala semi-final verdict has put Left on red alert ahead of April 9 polls

కేరళలో ఆసక్తికర పోరు

ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌ హోరాహోరీ 

రెండు కూటములకూ బీజేపీ బెంగ

కేరళలో ఈ అసెంబ్లీ ఎన్నికలు అధికార వామపక్ష కూటమి ఎల్డీఎఫ్‌కు అగ్నిపరీక్షగా, కాంగ్రెస్‌ సారథ్యంలోని విపక్ష యూడీఎఫ్‌కు అస్తిత్వ పరీక్షగా మారాయి. దేశంలో మిగిలిన తమ ఏకైక కంచు కోటను వామపక్షాలు ఏ మేరకు కాపాడు కోగలవన్నది ఆసక్తికరం. కేరళలో ఐదేళ్లకోసారి పారీ్టలను గద్దె దింపే 40 ఏళ్ల  ఆనవాయితీని బద్దలు కొడుతూ ఎల్డీఎఫ్‌ ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలిచింది. సీఎం పినరయి విజయన్‌ సారథ్యంలో ఈసారీ విజయ బావుటా ఎగరేసి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా హ్యాట్రిక్‌ కొట్టాలని ఆశపడుతోంది. ఆ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడం, ఇటు యూడీఎఫ్‌ కూటమిని, అటు రాష్ట్రంలో శరవేగంగా విస్తరిస్తున్న బీజేపీని నిలువరించడం అధికార కూటమికి అగి్నపరీక్షే కానుంది.

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార ఎల్డీఎఫ్‌ తమ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. సామాజిక భద్రత పెన్షన్‌ పథకం వంటివాటినే ప్రచారంలో ఎక్కువగా ప్రస్తావిస్తూ వస్తోంది. కానీ నిరుద్యోగం, ప్రజల్లో అసంతృప్తి, పదేళ్లుగా అధికారంలో ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. దాంతో ప్రజల్లో సీఎం విజయన్‌కు ఉన్న ఆదరణపైనే గట్టిగా ఆశలు పెట్టుకుంది. విపక్ష యూడీఎఫ్‌ మరో రకం సవాళ్లకు ఎదురీదుతోంది. వరుసగా రెండుసార్లు అధికారానికి దూరంగా ఉండటంతో కాంగ్రెస్‌ కూటమి ఆర్థికంగా బాగా బలహీనపడింది. ఇది ప్రచారంపై గట్టి ప్రభావమే చూపుతోంది. 

ఈసారీ నెగ్గని పక్షంలో కాంగ్రెస్, ఐయూఎంఎల్‌ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి. దాంతో యూడీఎఫ్‌ ఈసారి సర్వశక్తులూ ఒడ్డుతోంది. విజయన్‌ సర్కారు అవినీతిని ప్రధానాంశంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. నిరుద్యోగం తదితరాలనూ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతపైనా గట్టిగానే ఆశలు పెట్టుకుంది. అయితే నేతల కుమ్ములాటలు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారాయి. ఇక బీజేపీ కొన్నేళ్లుగా కేరళలో తన బలాన్ని, ప్రతి ఎన్నికల్లోనూ ఓట్ల శాతాన్ని క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. అధికార, విపక్ష కూటములకు మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ఎల్డీఎఫ్‌పై నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత, యూడీఎఫ్‌ పక్షాల్లో అనైక్యతకు ప్రధాని మోదీ జనాకర్షణ శక్తి, హిందూత్వ కార్డు తోడై మెరుగైన ఫలితాలొస్తాయని బీజేపీ ఆశలు పెట్టుకుంది.  
 

బీజేపీ 
సానుకూలతలు 
→ రాష్ట్రవ్యాప్తంగా బలపడుతున్న సంకేతాలు 
→ 2016తో పోలిస్తే పెరిగిన ఓట్ల శాతం 
→ మోదీ కరిష్మా, హిందూత్వ కార్డు 
→  ‘డబుల్‌ ఇంజిన్‌ సర్కారు’ప్రచారం  
ప్రతికూలతలు 
→ సానుకూలతను ఓట్లుగా మలచడంలో వైఫల్యం 
→ రాష్ట్రంలో సమర్థమైన నాయకులు లేకపోవడం 
→ కరడుగట్టిన హిందూత్వ ముద్ర

ఎల్డీఎఫ్‌ 
సానుకూలతలు 
→ బూత్‌ స్థాయి దాకా పటిష్ట నిర్మాణం 
→ ప్రజల్లో సీఎం విజయన్‌కు ఉన్న ఆదరణ 
→ సంక్షేమ పథకాలు 
→ యూడీఎఫ్‌ కూటమి పక్షాల అనైక్యత 

ప్రతికూలతలు 
→ ఉద్యోగ కల్పన హామీల అమల్లో వైఫల్యం 
→ నానాటికీ పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత 
→ ద్వితీయ శ్రేణిలో నాయకత్వ లేమి 
→ శబరిమల వివాదాలతో అప్రతిష్ట

యూడీఎఫ్‌ 
సానుకూలతలు 
→ సెంట్రల్‌ కేరళపై తిరుగులేని పట్టు 
→  క్రైస్తవ, ముస్లిం మైనారిటీ ఓటర్ల దన్ను 
→ తాజా స్థానిక ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన 
→ ఎల్డీఎఫ్‌పై ప్రభుత్వ వ్యతిరేకత   

ప్రతికూలతలు
→ కూటమి పార్టీల్లో పెచ్చరిల్లిన వర్గ పోరు 
→  ఓమెన్‌ చాందీ తర్వాత ఆ తరహా మాస్‌ ఇమేజీ ఉన్న నాయకుడు లేకపోవడం 
→ సీపీఎంతో పోలిస్తే బూత్‌ స్థాయిలో బలహీన నిర్మాణం 
→ గత అసెంబ్లీ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన 
→ ఎల్డీఎఫ్‌ వ్యతిరేక ఓట్లను బీజేపీ చీల్చే ప్రమాదం 
   
  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement