బిహార్‌లో ఆర్జేడీ పాలనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం
‘నమో యాప్’ ద్వారా బీజేపీ కార్యకర్తలతో సంభాషణ
న్యూఢిల్లీ: బిహార్‌లో లెక్కలేనన్ని అరాచకాలు సృష్టించిన జంగిల్‌రాజ్‌ను వందేళ్లయినా మర్చిపోలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పాలనపై నిప్పులు చెరిగారు. అప్పటి అకృత్యాలను దాచిపెట్టేందుకు విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల మది నుంచి చెరిగిపోవని చెప్పారు. జంగిల్‌రాజ్ నుంచి బిహార్‌కు విముక్తి కల్పించేందుకు సీఎం నితీశ్ కుమార్‌తోపాటు ఎన్డీఏ ఎంతగానో కష్టపడిందని తెలిపారు.
రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనను నెలకొలి్పందని, రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తాము బిహారీలమని గర్వంగా చెప్పుకుంటున్నారని వెల్లడించారు. విపక్ష మహాగఠ్‌బంధన్ నేతలు బెయిల్‌పై బయట ఉన్నారని, అది నేరగాళ్ల కూటమి(లాఠ్‌బంధన్) అని మండిపడ్డారు. ప్రధాని మోదీ గురువారం ‘నమో యాప్’ ద్వారా బిహార్ బీజేపీ కార్యకర్తలతో సంభాషించారు. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కూటమి నేతలు, కార్యకర్తలంతా కలిసికట్టుగా ప్రచారం సాగించాలని చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు. రఫ్తార్ పకడ్ చుకా బిహార్, ఫిర్ సే ఎన్డీఏ సర్కార్(బిహార్‌లో ప్రభంజనం ఊపందుకుంది, మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది) అని మోదీ కొత్త నినాదం ఇచ్చారు.
తమ కూటమి పాలనలో ఆల్‌రౌండ్ అభివృద్ధి జరిగిందన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, రైలు మార్గాలు నిర్మించినట్లు గుర్తుచేశారు. కేంద్రంలో, బిహార్‌లో స్థిరమైన ప్రభుత్వాలు ఉండడం వల్లే ఈ ప్రగతి సాధ్యమైందని తేల్చిచెప్పారు. సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ జయంతి సందర్భంగా ఈ నెల 31న జరిగే ‘ఐక్యతా పరుగు’లో యువత భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
యువతదే కీలక పాత్ర
మరోసారి దగా చేయడానికి వస్తున్న నేరగాళ్ల కూటమికి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆ కూటమికి సొంత ప్రయోజనాలే తప్ప ప్రజాసేవ అంటే ఏమాత్రం తెలియదన్నారు. నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదం వల్ల బిహార్ యువత దశాబ్దాలపాటు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగాలు, ఉపాధికి దూరమయ్యారని చెప్పారు. అప్పటి పాలకులు ఎన్నికల్లో నెగ్గడానికి మావోయిస్టులను వాడుకున్నారని ప్రధానమంత్రి మండిపడ్డారు. కడుపు మండిన ప్రజలు ఓటు అనే ఆయుధంతో జంగిల్‌రాజ్‌ను ఓడించారని తెలిపారు.
ఆనాటి అరాచక రాజ్యం మళ్లీ రావాలని ఎవరూ కోరుకోవడం లేదని స్పష్టంచేశారు. ఓటు విలువ బిహార్ ప్రజలకు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నారు. జంగిల్‌రాజ్ కాలం నాటి వేధింపులు, ఘోరాల గురించి ఇప్పటి యువతకు తెలియజేయాలని పేర్కొన్నారు. బిహార్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి ఈ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇందులో యువత కీలక పాత్ర పోషించబోతున్నారని ఉద్ఘాటించారు. మహిళా సాధికారత విషయంలో నవంబర్ 14న నూతన శకం ప్రారంభం కాబోతోందని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు.


