మువ్వన్నెల రిబ్బన్‌ కత్తిరిస్తారా ఎవరైనా: ఒమర్‌ | Jammu Kashmir CM Omar Abdullah refuses to cut Tricolour ribbon | Sakshi
Sakshi News home page

మువ్వన్నెల రిబ్బన్‌ కత్తిరిస్తారా ఎవరైనా: ఒమర్‌

Apr 16 2026 5:46 AM | Updated on Apr 16 2026 5:46 AM

Jammu Kashmir CM Omar Abdullah refuses to cut Tricolour ribbon

శ్రీనగర్‌: రాష్ట్ర వేసవికాల రాజధాని శ్రీనగర్‌లో బుధవారం ఒక ఎగ్జిబిషన్‌ను ప్రారంభించేందుకు వచ్చిన జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా అక్కడి ముఖద్వారానికి అడ్డంగా పెట్టిన ప్రారంభోత్సవ రిబ్బన్‌ను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఇదేం రిబ్బన్‌? త్రివర్ణ పతాక రంగుల్లో ఎవరైనా రిబ్బన్‌ను సిద్ధంచేస్తారా? నేను అస్సలు దీనిని కత్తిరించబోను. వెంటనే దీనిని జాగ్రత్తగా పక్కకు తీసేయండి. పడేయకుండా మడతపెట్టి జాగ్రత్తపరచండి’’అని అధికారులకు సూచించారు. అసలు ఈ ఐడియా ఎవరిది? అని ఆరాతీశారు. దీంతో కంగుతిన్న అక్కడి ఎగ్జిబిషన్‌ నిర్వహకులు మాకు తెలియదు, మాకు తెలియదు అంటూ నీళ్లు నమిలారు.

 ఘటన జరిగినప్పుడు సీఎంతోపాటు డెప్యూటీ సీఎం సురీందర్‌ చౌదరి, సలహాదారు నసీర్‌ ఆలం తదితరులు ఉన్నారు. శ్రీనగర్‌లోని కశ్మీర్‌ హాత్‌ ప్రాంతంలోని ‘నో యువర్‌ ఆర్టిసాన్‌’ఎగ్జిబిషన్‌ ఈ ఘటనకు వేదికైంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ముఖ్యమంత్రి దేశభక్తి, సమయస్ఫూర్తిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘‘జాతీయజెండాకు నిజమైన గౌరవం ఇవ్వడమంటే ఇదే. చవకబారు టీవీ చర్చలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సీఎం సమయస్ఫూర్తితో వ్యవహరించారు. మన మాటలకంటే చేతలే శక్తివంతంగా ప్రజల్లోకి వెళ్తాయి’’అని నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ పార్టీ నేత గగన్‌ భగత్‌ అన్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement