‘జల్‌జీవన్‌’తో వందశాతం రక్షిత మంచి నీరు

Jal Jeevan Mission Telangana Provided safe Drinking water to every household - Sakshi

తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఆస్తిపన్ను, విద్యుత్‌ చార్జీలు పెంచినట్లు కేంద్ర ఆర్థిక సర్వేలో వెల్లడి 

సాక్షి, న్యూఢిల్లీ: జల్‌ జీవన్‌ మిషన్‌లో భాగంగా తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలు వంద శాతం మేర ప్రతీ ఇంటికి సురక్షిత మంచినీటిని అందించాయని కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ప్రజలపై పన్నులు మోపి ఆదాయాలు పెంచుకున్నాయని వెల్లడించింది. కోవిడ్‌–19 మహమ్మారితో రాష్ట్రాల రెవెన్యూలకు పెద్దఎత్తున తగిలిన ఎదురుదెబ్బతో కేంద్ర ప్రభుత్వం పలు రకాలుగా వాటిని ఆదుకుందని పేర్కొంది. అయితే పట్టణ ఆర్థిక వనరులపై ఇటీవల ఆర్బీఐ ఇచి్చన నివేదికలో ఓఈసీడీ దేశాల కంటే భారత్‌లో ఆస్తిపన్ను వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయని ఎత్తిచూపింది.

రాష్ట్రాలు వసూలు చేస్తున్న ఆస్తిపన్నుల్లో అసమానతలు ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల ఆస్తిపన్ను విధానాల్లో పెద్దఎత్తున సంస్కరణలకు అవకాశం ఏర్పడుతుందని ఆర్బీఐ నివేదికలో పేర్కొందని ఆర్థిక సర్వే వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, హర్యానా, కేరళ, అసోం, పుదుచ్చేరి 2022–23 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్‌ చార్జీలను సవరించాయని మంగళవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక సర్వే 2022–23లో పేర్కొన్నారు. వీటితోపాటు 2022 ఏప్రిల్‌ నుంచి సెపె్టంబర్‌ వరకు అకాల భారీ వర్షాల కారణంగా పంటనష్టం, సరఫరాలో అంతరాయం కారణంగా కూరగాయల్లో అధిక ద్రవ్యోల్బణం నమోదైందన్నారు. ఈ కారణంగా టమోటాల ధరల పెరుగుదల ప్రభావం ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై పడిందని వెల్లడించారు.  

పెరిగిన ద్రవ్యోల్బణం 
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా సహా చాలా రాష్ట్రాల్లో కన్జూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ (సీపీఐ–సీ) ద్రవ్యోల్బణం పెరిగిందని, దీనికి ఇంధనం, దుస్తులు ప్రధాన కారణమని ఆర్థిక సర్వే పేర్కొంది. ప్రసూతి మరణాల నిష్పత్తి(ఎంఎంఆర్‌) 2014–16లో లక్షకు 130 మంది ఉండగా, 2018–20లో లక్షకు 97గా నమోదైందని తెలిపింది. కాగా, 2030 నాటికి ప్రతి లక్ష సజీవ జననాలకు ప్రసూతి మరణాలరేటు(ఎంఎంఆర్‌) 70 కంటే తక్కువకు తగ్గించాలనే లక్ష్యాన్ని తెలంగాణ(43), ఆంధ్రప్రదేశ్‌(45) సహా ఎనిమిది రాష్ట్రాలు ఇప్పటికే సాధించాయని పేర్కొంది. ముఖ్యంగా, ప్రధానమంత్రి గతిశక్తి, కోవిడ్‌–19 నేపథ్యంలో లాజిస్టిక్స్‌ రంగంలోని ప్రస్తుత పరిణామాలను పరిగణనలోకి తీసుకొని విడుదల చేసిన లీడ్స్‌–2022 సర్వేలో తెలంగాణ 90 శాతం కంటే ఎక్కువ స్కోర్‌ సాధించి అచీవర్స్‌ జాబితాలో చేరిందని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది.    

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top