ఇజ్రాయెలీ సహా  ఇద్దరిపై గ్యాంగ్‌ రేప్‌ | Israeli tourist and local woman molestation in Hampi near Karnataka | Sakshi
Sakshi News home page

Karnataka: ఇజ్రాయెలీ సహా ఇద్దరిపై గ్యాంగ్‌ రేప్‌

Mar 9 2025 5:54 AM | Updated on Mar 10 2025 12:51 PM

Israeli tourist and local woman molestation in Hampi near Karnataka

మరో ముగ్గురు టూరిస్టులపై దాడి.. 

కాలువలోకి నెట్టివేయడంతో ఒకరు మృతి

కర్ణాటకలోని హంపిలో దారుణం

నిందితుల్లో నలుగురి అరెస్ట్‌ 

సాక్షి, బళ్లారి: కర్ణాటకలోని చారిత్రక హంపి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన మహిళతోపాటు వారికి ఆతిథ్యమిస్తున్న స్థానిక మహిళపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతోపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకున్న ముగ్గురు పురుష పర్యాటకులపై దుండగులు దాడి చేసి, తీవ్రంగా కొట్టారు. తుంగభద్ర కాలువలోకి నెట్టివేయగా వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు నిందితులను పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు చేపట్టారు.

గురువారం రాత్రి 11 గంటల సమయంలో గంగావతి సమీపంలోని సన్నాపుర వద్ద ఉన్న తుంగభద్ర కాలువ ఒడ్డున ఈ దారుణం చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన బిదాష్‌, మహారాష్ట్ర వాసి పంకజ్, అమెరికా పౌరుడు డానియెల్‌తోపాటు, ఇజ్రాయెల్‌ పర్యాటకురాలు, వీరికి ఆతిథ్యమిచ్చిన 29 ఏళ్ల స్థానిక మహిళ.. వీరంతా కలిసి తుంగభద్ర కాలువ ఒడ్డున గిటారు వాయిస్తూ సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. అదే సమయంలో, కొందరు దుండగులు వీరి వద్దకు వచ్చి, పెట్రోల్‌ బంక్‌ ఎక్కడుందంటూ ప్రశ్నించారు. సనపూర్‌కు వెళ్లాలని బదులివ్వడంతో రూ.100 ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. 

తెలుగు, కన్నడలో వారిని దూషించడం మొదలుపెట్టారు. దుండగుల్లో ఇద్దరు ఇజ్రాయెల్‌ మహిళతోపాటు ఆతిథ్యమిచ్చిన స్థానిక మహిళపైనా అత్యాచారానికి పాల్పడ్డారు మూడో వ్యక్తి ముగ్గురు పురుషులను తుంగభద్ర కాలువలోకి నెట్టివేశాడు. దీంతో, వీరిలో డానియెల్, పంకజ్‌లు ప్రాణాలతో బయటపడగా గల్లంతైన బిదాష్‌ మృతదేహం శనివారం ఉదయం కాలువలో దొరికింది. దుండగులు అంతటితో ఆగక స్థానిక మహిళను తీవ్రంగా కొట్టారు. 

ఆమె బ్యాగులో ఉన్న రెండు సెల్‌ఫోన్లు, రూ.9,500 నగదును దోచుకున్నారు. అనంతరం దుండగులు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం బాధితుల ఫిర్యాదు మేరకు గంగావతి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధిత మహిళలిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కొప్పాల్‌ ఎస్‌పీ రామ్‌ ఎల్‌ సిద్ధి చెప్పారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు నిందితులను గంగావతి పట్టణానికి చెందిన మల్లేశ్, చేతన్‌ సాయి, మోహన్, చన్నదాసర అనే వారిని పట్టుకున్నామన్నారు. ఐదో వ్యక్తిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఆరు పోలీస్‌ బృందాలను రంగంలోకి దించామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement