
న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు విదేశీ ప్రముఖులను అతిథులుగా ఆహ్వానించే సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. దీనిలో భాగంగా 2025 జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను ఆహ్వానించనున్నారని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
సుబియాంటో భారతదేశం-ఇండోనేషియా సంబంధాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. భారత్‌కు చెందిన బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు చేయడంతోపాటు పలు రక్షణ ఒప్పందాలపై ఆయన దృష్టి సారిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒప్పందం ఖరారైతే ఫిలిప్పీన్స్ తర్వాత భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసిన రెండో దేశంగా ఇండోనేషియా అవతరిస్తుంది.
1950లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు నాటి ఇండోనేషియా మొదటి అధ్యక్షుడు సుకర్ణో మొదటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసారి ప్రబోవో భారత గణతంత్ర వేడుకలకు హాజరైన పక్షంలో ఇండోనేషియా సైనిక బృందం కూడా రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొంటుంది. ఈ నెలాఖరులో బ్రెజిల్‌లో జరగనున్న జీ-20 సదస్సు సందర్భంగా ప్రబోవో, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య భేటీ జరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌గా అబ్దుల్ రహీమ్ రాథర్