
ఐఎస్‌ఎస్ లోపలి వాతావరణాన్ని చూసి అబ్బురపడిన విద్యార్థులు
విద్యార్థుల ప్రశ్నలకు సావధానంగా శుక్లా సమాధానం
లక్నో/తిరువనంతపురం: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లోని భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి కేరళ, ఉత్తరప్రదేశ్ పాఠశాల విద్యార్థులు అత్యంత అరుదైన, మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందారు. భారరహిత స్థితిలో స్వేచ్ఛగా గాల్లో కదలాడుతూ బంతితో ఆడుకుంటున్న శుక్లాను చూసి ఆ విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పట్టరాని ఆనందంతో పదే పదే ప్రశ్నలు సంధించారు.
వాళ్ల ప్రశ్నలకు శుక్లా వివరణాత్మక సమాధాలిచ్చారు. ‘‘ ఆయన అలా శూన్యస్థితిలో చక్కర్లు కొడుతుంటే ఎంతో చూడముచ్చటగా ఉంది. మేము అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఐఎస్‌ఎస్‌లో ఎలా గాల్లో ఈదినట్లుగా ముందుకు కదలాలో ఆయన స్వయంగా కదిలి చూపించారు’’ అని కోజికోఢ్‌లోని నయార్‌కుళి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని సంఘవి చెప్పారు.
శుక్లా సొంతూరు లక్నోలో, తిరునంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లోని విద్యార్థులూ ఆయనతో మాట్లాడారు. ఐఎస్‌ఎస్‌లో ఉన్నప్పుడు వ్యోమగాములు ఎలాంటి ఆహారం తీసుకుంటారు?. అలా కదులుతూ ఉంటే నిద్రపోవడమెలా?. హఠాత్తుగా ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్ ఉండరుగా. అప్పుడెలా?. ఇక్కడి నుంచి ఐఎస్‌ఎస్‌కు వెళ్లాక ఎంతకాలానికి అక్కడి వాతావరణానికి అలవాటుపడతారు?. తిరిగొస్తే ఇక్కడ మామూలుగా మారడానికి ఎంత టైమ్ పడుతుంది?.. ఇలా విద్యార్థులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు శుక్లా సమాధానాలు చెప్పారు.
‘‘ ఐఎస్‌ఎస్‌లో నిద్రపోవడం ఒక సరదా పని. ఇక్కడ నేల, పైకప్పు రెండూ ఉండవు. అందుకే కొందరు గోడలకు, కొందరు సీలింగ్‌కు అతుక్కుని నిద్రిస్తూ కనిపిస్తారు. కదలకుండా పడుకోవాలంటే నిద్రపోయే స్లీపింగ్ బ్యాగ్‌ను దేనికైనా కట్టేసుకోవాల్సిందే’’ అని ఆయన నవ్వుతూ చెప్పారు. దీంతో విద్యార్థులు విరగబడి నవ్వారు. ‘‘ ఇక్కడి వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు నేను ఎంతో మెరుగ్గా ఉన్నా. భారరహిత స్థితికి అలవాటు పడటం కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది. తిరిగి భూమి మీదకొచ్చాక గురుత్వాకర్షణ స్థితికి మారడం కూడా ఒక సవాలే’’ అని శుక్లా అన్నారు.
‘‘ ఒంటరిగా ఉన్నామని ఫీల్ అయితే వెంటనే కుటుంబసభ్యులు, స్నేహితులతో వర్చువల్‌గా మాట్లాడి మనసును తేలికచేసుకుంటాం. తరచూ వ్యాయామం చేస్తాం. ప్రయోగాలు సరేసరి’’ అంటూ శుక్లా చెప్పుకొచ్చారు. ఇస్రో వారి విద్యార్థి సంవాద్ కార్యక్రమంలో భాగంగా వ్యోమగాములతో విద్యార్థుల మాటామంతీ పోగ్రామ్‌ను నిర్వహించారు. ‘‘ ఎప్పుడైనా కొన్ని నిమిషాలు తీరిక సమయం దొరికితే వెంటనే కిటికీల వద్దకు వెళ్లి అంతరిక్ష నుంచి మన పుడమిని చూడటం ఎంతో ఆసక్తికరంగా, ఆనందంగా ఉంటుందని ఆయన నాతో చెప్పారు’’ అని ఒక విద్యార్థి ‘పీటీఐ వీడియోస్’తో చెప్పింది.