
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులను సమర్థంగా తిప్పికొట్టడంలో ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థలు కీలకంగా పనిచేశాయి. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఈ వ్యవస్థలు ‘సుదర్శన చక్ర’గా భారతదేశ రక్షణ శాఖకు తురుపుముక్కగా మారాయి. శత్రుదేశాల క్షిపణులను నేలకూల్చడంలో వీటికి తిరుగులేదు.
ఈ నేపథ్యంలో మరిన్ని ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అందజేయాలని రష్యాకు భారత ప్రభుత్వం తాజాగా విజ్ఞప్తి చేసింది. అత్యంత విశ్వసనీయ వర్గాలు ఈ విషయం వెల్లడించాయి. భారత్ వినతిని అతిత్వరలోనే రష్యా అంగీకరించే సూచనలు కనిపిస్తున్నట్లు తెలిపాయి. ఇటీవలి పరిణామాల తర్వాత గగనతల రక్షణ వ్య వస్థలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. రష్యా నుంచి ఐదు ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కొనుగోలు కోసం 2018లో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ 5.43 బిలియన్ డాలర్లు. 2021 నుంచి దశలవారీగా ఐదు వ్యవస్థలు రష్యా నుంచి భారత్‌కు చేరుకున్నాయి.
ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్
ఎస్-400 ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు అవకాశం ఉంటుంది. దాన్ని ఓ వాహనంపై అమర్చవచ్చు. ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్‌ని ధ్వంసం చేస్తుంది. ఒకేసారి 36 టార్గెట్‌లను ట్రాక్ చేసే సామర్థ్యం దీనికి ఉంది. అలాగే, 12 టార్గెట్స్‌పై ఒకే సారి దాడి చేస్తుంది. 600 కిలోమీటర్ల దూరం నుంచే ట్రాక్ చేస్తూ.. 400 కిలోమీటర్ల పరిధిలోనే శత్రువుల మిస్సైల్స్‌ను కూల్చే సత్తా వీటి సొంతం. విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ ఇలా వేర్వేరు లక్ష్యాలను ఒకేసారి టార్గెట్ చేసి ఛేదిస్తుంది. వీటిని రియాక్షన్ టైమ్ చేలా వేగంగా ఉంటుంది. ఎస్-400 యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఫైర్ చేసేందుకు ఐదు నిమిషాల్లోనే రెడీ చేయొచ్చు. ఇందులో 3డీ ఫేజ్‌డ్ అరే రాడార్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది.