అప్పుడు మాత్రమే హర్మూజ్‌ను దాటండి: భారత్‌ | India shares fresh advisory for tankers in Hormuz | Sakshi
Sakshi News home page

అప్పుడు మాత్రమే హర్మూజ్‌ను దాటండి: భారత్‌

Apr 20 2026 3:36 PM | Updated on Apr 20 2026 4:17 PM

India shares fresh advisory for tankers in Hormuz

హర్మూజ్‌ జలసంధిని దాటే క్రమంలో రెండు వాణిజ్య నౌకలపై దాడి చేయడంతో భారత్‌ అప్రమత్తమైంది. మొన్నటి వరకూ హర్మూజ్‌ను జలసంధిని దాటే క్రమంలో భారత్‌కు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, రెండు రోజుల క్రితం భారత్‌ నౌకలపై ఇరాన్‌ దాడి చేయడం కాస్త ఆందోళన కల్గించింది. ఇరాన్‌ అనుమతి ఇచ్చిన తర్వాతే ఆ నౌకలు హర్మూజ్‌ను దాటుతున్నప్పటికీ  ఒక్కసారిగా దాడి జరిగింది. దీనిపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 

అయితే అమెరికా-ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడమ హర్మూజ్‌ జలసంధి దిగ్బంధనాన్ని ఇరాన్‌ మరింత పటిష్టం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. హర్మూజ్‌ను తెరిచినట్లే తెరిచి మళ్లీ మూసేసిన ఇరాన్‌.. అందుకు అమెరికా వైఖరే కారణమని ధ్వజమెత్తింది. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైఖరితో విసుగెత్తిపోయిన ఇరాన్‌.. ఇక చేసేది లేక హర్మూజ్‌ను దిగ్బంధనాన్ని కొనసాగించడమే కాకుండా దానిని మరింత పటిష్టంగా చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏ నౌకలకు ఇరాన్‌ అనుమతి ఇవ్వడం లేదు. ఆ క్రమంలోనే భారత నౌకలపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. 

అప్పటివరకూ హర్మూజ్‌ను దాటకండి
ఈ పరిస్థితుల నడుమ భారత్‌ కొన్ని నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. తమ ఆదేశాలు వచ్చే వరకూ హర్మూజ్‌ను భారత నౌకలు దాటే ప్రయత్నం చేయొద్దని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే లారక్ దీవి దగ్గరికి వెళ్లకుండా ఉండాలని తమ ఆదేశాల్లో పేర్కొంది, భారత నౌకాదళం సూచించినప్పుడు మాత్రమే హోర్ముజ్ జలసంధి దాటాలని పేర్కొంది. 

ఏప్రిల్ 18వ తేదీన ఐఆర్‌జీసీ(ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ )రెండు భారత నౌకలపై కాల్పులు జరిపిన ఘటన తర్వాత హోర్ముజ్ జలసంధి వద్ద భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది భారత నౌకాదళం.

ఇప్పటివరకు పదకొండు భారత నౌకలు జలసంధిని విజయవంతంగా దాటాయి. చివరి ట్యాంకర్ దేశ్ గరీమా ఏప్రిల్ 18న దాటింది. అదే రోజు జగ్‌ అర్ణవ్‌, సన్మార్‌ హెరాల్డ్‌ నౌకలు.. ఇరాన్‌ కాల్పుల కారణంగా వెనక్కి తిరగాల్సి వచ్చింది. 

పర్షియన్ గల్ఫ్‌లో తమ దేశ నౌకల భద్రతకు సంబంధించి లారక్ దీవి వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించింది. బారత నౌకాదళం. దీనిలో భాగంగానే కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 

లారాక్ ద్వీపం
ఇరాన్ తీరానికి సమీపంలోని హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. ఇది వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. 
అంతర్జాతీయ నౌకాయానానికి కీలకమైన మార్గం. ముఖ్యంగా హోర్ముజ్‌ జలసంధి నియంత్రణలో భాగంగా ఇరాన్‌ ఈ ద్వీపాన్ని సైనికంగా ఉపయోగిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement