కరోనా ఎఫెక్ట్: పెరిగిన కుటుంబాల పొదుపు.. ఎంతంటే? | Sakshi
Sakshi News home page

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కుటుంబాల పొదుపు.. ఎంతంటే?

Published Wed, Apr 28 2021 2:24 PM

India Household Savings Increase In 2020: Motilal Oswal - Sakshi

ముంబై: మహమ్మారి కరోనా వల్ల భారతీయులు 2020లో దాదాపు ఇళ్లకే పరిమితం కావడంతో కుటుంబాల పొదుపు రేటు పెరిగింది. స్థూల దేశీయోత్పత్తి విలువలో ఈ రేటు 22.5 శాతంగా నమోదయినట్లు బ్రోకరేజ్‌ సంస్థ-మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్ తాజా నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం 2019 జీడీపీతో పోల్చితే పొదుపు రేటు 19.8 శాతంగా ఉంది. జీడీపీ విలువలతో పోల్చి నివేదికలో పొందుపరచిన కొన్ని ముఖ్యాంశాలను, గణాంకాలను పరిశీలిస్తే... 

  • కఠిన లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య కాలంలో గృహాల పొదుపురేటు కేవలం 5.8 శాతంగా నమోదయ్యింది. మహమ్మారి ముందస్తు స్థాయితో పోల్చితే దాదాపు సగానికి సగం పడిపోయింది. నిత్యావసరాలకు భారీ వ్యయాలు, ఉపాధి అవకాశాలు దెబ్బతినడం వంటి అంశాలు దీనికి కారణం కావచ్చు. 
  • మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25-ఏప్రిల్‌ 14, ఏప్రిల్‌ 15-మే 3, మే 4- మే 17, మే 18-మే 31) కఠిన లాక్‌డౌన్‌ అమలు ఆర్థిక సంవత్సరం మొదటి (-24.4 శాతం), రెండు (-7.3 శాతం) త్రైమాసికాల్లో ఎకానమీని క్షీణతలోకి తోసింది. అయితే లాక్‌డౌన్‌ ఆంక్షలు క్రమంగా తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో మూడవ త్రైమాసికంలో 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదయ్యింది. 
  • డిసెంబర్‌ త్రైమాసికంలో పొదుపు రేటు భారీగా రికవరీ అయ్యింది. పలు సంవత్సరాల గరిష్ట స్థాయిలో 13.7 శాతంగా నమోదయ్యింది. 
  • సెప్టెంబర్ త్రైమాసికంలో కరెన్సీ రూపంలో పొట్టుబడులు పెరిగినా, డిపాజిట్లు, పెన్షన్లు, చిన్న పొదుపు పథకాల్లో పొదుపులు తగ్గాయి. 
  • డిసెంబర్‌ త్రైమాసికంలో బ్యాంకింగ్‌ యేతర ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ), హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (హెచ్‌ఎఫ్‌సీ)ల్లో రుణా భారాలను తగ్గించుకోడానికి కుటుంబాలు ప్రాధాన్యత ఇచ్చాయి. ఇదే సమయంలో బ్యాంకులు నుంచి రుణాలు పెరగడం గమనార్హం. 
  • కఠిన ఆంక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2020లో కుటుంబాల పొదుపురేట్లు పెరిగాయి. అయితే ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో పొదుపు పెరుగుదల రేటు తక్కువగా ఉంది.

చదవండి: 

వాట్సాప్‌ అడ్మిన్‌కు ఊరట.. హైకోర్టు కీలక తీర్పు 

Advertisement
Advertisement