
ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం
ఐఎండీ డైరెక్టర్ జనరల్ హెచ్చరిక
న్యూఢిల్లీ: సెప్టెంబరు నెలలోనూ దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఏటా సెప్టెంబరులో 167.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుందని, అయితే ఈ ఏడాది ఈ నెలలో సాధారణం కంటే 109 శాతం అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఈ వర్షాల వల్ల ఆకస్మిక వరదలు సంభవించి, కొండచరియలు విరిగిపడి జనజీవనం స్తంభించే ముప్పు ఉంటుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్రా హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాల వల్ల ఉత్తరాఖండ్‌లో నదులు ఉప్పొంగి కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలకు దారితీయవచ్చని, దక్షిణ హర్యానా, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్‌లలో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగిస్తాయని హెచ్చరించారు.
1980 నుంచి ఏటా సెప్టెంబరులో భారత్‌లో వర్షపాతం పెరుగుతోందని ఆయన తెలిపారు. అయితే 1986, 1991, 2001, 2004, 2010, 2015, 2019 సంవత్సరాల్లో సెప్టెంబరు నెలల్లో తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. సెప్టెంబరులో పశ్చిమ మధ్య, వాయవ్య, దక్షిణ భారత్‌లోని చాలా ప్రాంతాల్లో నెలవారీ సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో, సాధారణం కంటే తక్కువ స్థాయిలో ఉండొచ్చని మోహపాత్రా తెలిపారు. ఇక, తూర్పు మధ్య భారత్, తూర్పు, ఈశాన్య, వాయవ్య భారత్‌లోని పలు ప్రాంతాలు, పశ్చిమ తీర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ స్థాయుల్లో ఉండొచ్చని వెల్లడించారు.
3నెలలూ సాధారణం కంటే అధిక వర్షపాతం
‘జూన్ 1 నుంచి ఆగస్టు 31 మధ్య దేశంలో 743.1 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది దీర్ఘకాలిక సగటు 700.7 మి.మీ కంటే దాదాపు 6 శాతం ఎక్కువ. జూన్ నెలలో సాధారణం కంటే దాదాపు 9 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. జూలై నెలలో 294.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే దాదాపు 5 శాతం ఎక్కువ. ఆగస్టులో 268.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 5.2 శాతం ఎక్కువ. ఇప్పటివరకు వర్షాకాలం మూడు నెలల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది’ అని మోహపాత్రా వివరించారు.