
కొండచరియలు విరిగి ఏడుగురు మృత్యువాత
ఛార్‌ధామ్, హేమ్‌కుండ్ యాత్రలు నిలిపివేత
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో సోమవారం భీకర వర్షాలు, కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో ఏడుగురు చనిపోయారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ మార్గంలో సోమవారం ఉదయం కొండచరియలు విరిగి వాహనంపై పడగా ఇద్దరు యాత్రికులు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సోన్‌ప్రయాగ్–గౌరీకుండ్ మార్గంలోని ముంకాటియా వద్ద కొండప్రాంతం పక్క నుంచి వెళ్తున్న వాహనంపై ఒక్కసారిగా బండరాళ్లు పడ్డాయని అధికారులు తెలిపారు. బాధితులంతా ఉత్తరకాశీ జిల్లాకు చెందిన వారేనన్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థి తి విషమంగా ఉందన్నారు.
భారీ వర్షాలు కొనసాగుతుండటంతో ఛార్ ధామ్ యాత్ర, సిక్కుల హేమ్‌కుండ్ సాహిబ్‌కు వెళ్లే దారిని ఈ నెల 5వ తేదీ వరకు మూసివేసినట్లు అధికారులు వివరించారు. వాతా వరణం మెరుగయ్యాక, రహదారులు పూర్తి సురక్షితమని భావించిన తర్వాతే తిరిగి రాకపోకలను అనుమతిస్తామన్నారు. సోమవారం ఉదయం 8 గంటల వేళకు చంపావత్ జిల్లా బన్‌బాసాలో 25.64 సెంటీమీటర్లు, ఖతిమాలో 18.1 సెంటీమీటర్లు, తనక్‌పూర్‌లో 17.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశమున్న డెహ్రాడూన్, ఉత్తరకాశీ, తెహ్రీ, పౌడీ, నైనిటాల్ తదితర 9 జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
హిమాచల్‌లో ఐదుగురు..
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో 24 గంటల వ్యవధిలో వేర్వేరు చోట్ల కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఐదుగురు చనిపోయారు. వీరిలో ఒక మహిళ, ఏడేళ్ల ఆమె కుమార్తె ఉన్నారు. జుంగాలోని డబ్లూ ప్రాంతంలో కొండచరియలు విరిగి ఇల్లు కూలడంతో తండ్రి, అతడి పదేళ్ల కుమార్తె మరణించారు. సిమ్లాలోని కోట్‌ఖైలో ఇల్లు కూలి వృద్ధ మహిళ మరణించారు. కొండచరియలు విరిగిపడటంతో సిమ్లా–కల్కా మార్గంలో నడిచే ఆరు రైళ్లను రద్దు చేశారు. దెబ్బతిన్న ఐదు జాతీయ రహదారులు సహా 793 రహదారులను మూసివేశారు. మంగళవారం వరకు ఆరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం హెచ్చరించింది.
కశ్మీర్‌లో అమిత్ షా పర్యటన
జమ్మూకశ్మీర్‌లోని కత్రాలో భారీ వర్షం కురియడంతో మాతా వైష్ణోదేవి ఆలయాన్ని వరుసగా ఏడో రోజూ మూసి ఉంచారు. జమ్మూకశ్మీర్‌లోని వరద ప్రభావిత
ప్రాంతాల్లోని వారి పునరావాసానికి అన్ని విధాలుగా సాయమందిస్తామని
హోం మంత్రి అమిత్ షా తెలిపారు. సోమవారం జమ్మూలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.
అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా, సీనియర్ నేతలతో రాజ్‌భవన్‌లో జరిగిన సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు.