
సూడాన్‌లో ఓ గ్రామంపై విరిగిపడిన కొండచరియలు
వెయ్యి మందికిపైగా సజీవ సమాధి
ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్క వ్యక్తి
కైరో: అంతర్యుద్ధంతో తల్లడిల్లుతున్న ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఘోర ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. డార్‌ఫుర్‌రీజియన్‌లోని మర్రాహ్ పర్వతాల్లో ఆదివారం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో తరసిన్ అనే గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఈ విపత్తులో వెయ్యిమందికి పైగా సజీవ సమాధి అయినట్లు ఆ ప్రాంతంలో అధికారంలో ఉన్న సూడాన్ లిబరేషన్ మూవ్‌మెంట్ ఆర్మీ ప్రకటించింది. ఈ ఘోర ప్రమాదం నుంచి ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు వెల్లడించింది. తరసిన్ గ్రామం మర్రాహ్ పర్వతాల్లో 3000 మీటర్ల ఎత్తులో ఉంది. కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో భారీస్థాయిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రాంతం సూడాన్ రాజధాని ఖార్టోమ్‌కు 900 కిలోమీటర్ల దూరంలో ఉంది. మృతదేహాలను వెలికితీసేందుకు సూడాన్ లిబరేషన్ మూవ్‌మెంట్ ఆర్మీ అంతర్జాతీయ సాయం కోరింది.
మరుభూమిగా ప్రపంచ వారసత్వ ప్రాంతం
మర్రాహ్ పర్వతాలను యూనిసెఫ్ గతంలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఎత్తయిన ఈ పర్వతాల్లో చల్లని వాతావరణంతోపాటు భారీ వర్షాలు కురుస్తుంటాయి. ఇవన్నీ పురాతన అగి్నపర్వత ప్రాంతాలు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరు. సూడాన్‌లో 2023 ఏప్రిల్ నుంచి సైన్యానికి, పారామిలిటరీ దళమైన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్)కు మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. దీంతో ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి భారీగా వలస వెళ్లారు. తీవ్ర కరువు కారణంగా ఈ ప్రాంతంలో ప్రజలు గడ్డి తిని బతుకుతున్నారని కొన్నాళ్ల క్రితమే ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది.
యుద్ధం కారణంగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఐరాస కార్యకలాపాలు కూడా నిర్వహించటం లేదు. దీంతో తక్షణ సాయం అందించటం సాధ్యం కావటం లేదని సూడాన్ అధికార వర్గాలు తెలిపాయి. కొండలపై నుంచి మట్టి, రాళ్లు భారీ మొత్తంలో జారిపడటంతో తరసిన్ గ్రామం చాలా లోతులో కూరుకుపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. అక్కడ ఒక గ్రామం ఉన్న ఆనవాళ్లు కూడా కనిపించటం లేదు. ఇటీవలి కాలంలో సూడాన్‌లో అతిపెద్ద ప్రకృతి విపత్తుల్లో ఇదీ ఒకటిగా నిలిచింది.