Manish Sisodia Resignation Letter: ‘వారి టార్గెట్‌ నేను కాదు.. మీరే!’ రాజీనామా లేఖలో మనీష్‌ సిసోడియా

Iam Not Their Target You Manish Sisodia Resignation Letter To Kejriwal - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. లిక్కర్‌ స్కాం కేసులో సీబీఐ అరెస్ట్‌ చేయడం.. 5 రోజుల జ్యుడీషియల్‌ కస్టీడికి కోర్టు అనుమతిచ్చిన పరిణామాల నేపథ్యంలో సిసోడియా ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట్‌ అయి జైలులో ఉన్న మరో ఆప్‌ నేత, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ సైతం తన పదవికి రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమోదించారు. 

ఈ క్రమంలో తన రాజీనామా లేఖలో మనీష్‌ సీసోడియా పలు కీలక అంశాలు ప్రస్తావించారు. తనపై వస్తున్న ఆరోపణలను తప్పుబడుతూ.. గత ఎనిమిదేళ్లుగా నిజాయితీ, నిబద్దతతో పనిచేస్తుంటే అవినీతి ఆరోపణల్లో ఇరికించడం దురదృష్టకరమన్నారు. ‘ఈ ఆరోపణలన్నీ అబద్దాలని నాతోపాటు ఆ దేవుడికి తెలుసు. ఇదంతా అరవింద్‌ కేజ్రీవాల్‌ స్వచ్ఛమైన రాజకీయాలకు బయపడి చేస్తున్న కొందరు బలహీనులు పిరికితనంతో చేస్తున్న కుట్ర తప్ప మరేం లేదు. నిజానికి వాళ్ల టార్గెట్ నేను కాదు.. మీరే(కేజ్రీవాల్‌) వాళ్ల అసలైన టార్గెట్‌.

ఎందుకంటే నేడు కేవలం ఢిల్లీ మాత్రమే కాదు దేశ ప్రజలంతా మిమ్మల్ని గొప్ప విజన్ ఉన్న నాయకుడిగా చూస్తున్నారు. సరికొత్త విధానాలను అమలు చేయడం ద్వారా వాళ్ల జీవితాల్లో పెను మార్పులు తీసుకురాగల సామర్థ్యం మీకు ఉందని ప్రజలు నమ్ముతున్నారు’ అని అరవింద్ కేజ్రీవాల్‌కు సిసోడియా రాసిన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.  ఆర్థిక సంక్షోభం, పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అవినీతి వంటి సమస్యలను ఎదుర్కొంటున్న కోట్లాది మంది కళ్లల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓ ఆశాదీపంగా కనిపిస్తున్నారని  ఆయన అన్నారు.

కాగా ఢిల్లీ మద్యం కుంభకుణం కేసులో  సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసిన విషయం తెలసిందే. ఈ పాలసీని రూపొందించి, అమలు చేయడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిసోడియాను సీబీఐ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఢిల్లీని రౌస్‌ అవెన్యూ కోర్టు ఆయనను 5 రోజుల సీబీఐ కస్టడీకి పంపింది. తన అరెస్ఠ్‌ను సవాల్‌ చేస్తూ మనీష్‌ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన  పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. దీనిపై ఢిల్లీ హైకోర్టును సంప్రదించాలని న్యాయస్థానం సూచించింది.
చదవండి: కొత్త లుక్‌లో రాహుల్‌ గాంధీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top