
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. శనివారం (జూలై 19) రాత్రి బాగోద్ర గ్రామంలో ఒకే కుటుంబానికి ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. అద్దె ఇంట్లో నివసిస్తున్న వీరు విషం తాగారనే అనుమానాలున్నాయి. మృతుల్లో భర్త, భార్య వారి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు.
కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకునేందుకు దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతులను విపుల్ కాంజి వాఘేలా (34), అతని భార్య సోనాల్ (26), వారి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవానిగా పోలీసులు గుర్తించారు. వీరి కుటుంబం మొదట గుజరాత్‌లోని ధోల్కాలో ఉండేది. విపుల్ వాఘేలా ఆటో రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే, బాగోద్ర పోలీసులు, 108 అంబులెన్స్ బృందం, అహ్మదాబాద్ రూరల్ ఎస్పీ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్థిక ఒత్తిడి కారణంగానే కాంజి వాఘేలా కుటుంబం ఆత్మహత్యకు పాల్పడివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
విపుల్ బావమరిది ఈ ఘటన గురించి మాట్లాడుతూ విపుల్ రుణం తీసుకుని ఆటోరిక్షాను కొనుగోలు చేశాడని, ప్రతీనెలా రూ. ఐదువేల ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడుతున్నాడని తెలిపారు. ఆ భారమే అతన్ని ఆత్మహత్యకు పురిగొల్పి ఉండవచ్చని అన్నారు. కాగా ఈ ఐదు మృతదేహాలను పోలీసులు పోస్ట్‌మార్టం కోసం బాగోద్ర కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు విపుల్ బంధువులను, పొరుగవారిని, పరిచయస్తులను విచారిస్తున్నారు.