రూ.2 కోట్లు దాటితేనే ‘జీఎస్టీ’నేరం

GST Council doubles limit for launching prosecution to Rs 2 Cr - Sakshi

జీఎస్టీ అత్యున్నత మండలి నిర్ణయం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నేర విచారణ విషయంలో అత్యున్నత స్థాయి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చట్టం ప్రకారం ప్రాసిక్యూషన్‌ ప్రారంభించేందుకు కనీస పన్ను పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.1 కోటి నుంచి రూ.2 కోట్లకు పెంచింది. నకిలీ ఇన్వాయిస్‌లకు మాత్రం పన్ను పరిమితి రూ.1 కోటి కొనసాగించాలని శనివారం జరిగిన 48వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నిర్ణయించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియాకు ఈ విషయాలను వెల్లడించారు. దేశంలో జీఎస్టీ పన్ను చెల్లింపుదార్ల సంఖ్య 1.4 కోట్లు కాగా నెలకు సగటున రూ.1.4 లక్షల కోట్లు వసూలవుతున్నాయని వివరించారు.

అధికారి విధులకు ఆటంకం కలిగించడం, ఉద్ధేశపూర్వకంగా సాక్ష్యాల తారుమారు, సరఫరా సమాచారాన్ని ఇవ్వకపోవడం వంటి మూడు అంశాలను నేర జాబితా నుంచి తొలగించాలని కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. రిఫైనరీలకు సరఫరా చేసే ఇథైల్‌ ఆల్కహాల్‌పై పన్ను 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని కౌన్సిల్‌ నిర్ణయించింది. అదనపు సుంకాల శాతాన్ని ప్రస్తుతం ఉన్న 50–150 శాతం శ్రేణి నుంచి 25–100 శాతం శ్రేణికి కుదించారు. పరిహార (కంపెన్సేషన్‌) పన్ను 22 శాతం విధించడానికి స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్స్‌ (ఎస్‌యూవీ) నిర్వచనంపై కూడా కౌన్సిల్‌ స్పష్టత ఇచ్చింది. ఇకపై 1,500 సీసీ ఆపైన ఇంజిన్‌ సామర్థ్యం, 4,000 మిల్లీమీటర్ల కంటే పొడవు, 170 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఉంటే ఎస్‌యూవీగా పరిగణిస్తామని సీతారామన్‌ తెలిపారు. అదేవిధంగా, ఆన్‌లైన్‌ గేమ్‌లు గెలవడం అనేది ఒక నిర్దిష్ట ఫలితంపై ఆధారపడి ఉంటే పూర్తి పందెం విలువపై 28 శాతం జీఎస్టీ ఉంటుందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top