
వస్తు సేవల పన్ను (GST) 2.0 క్రెడిట్ ముమ్మాటికీ తమదేనంటున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చురకలంటించారు. గతంలో జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని విమర్శించినవాళ్లే.. ఇప్పుడు GST 2.0కు క్రెడిట్ తీసుకుంటున్నారని అన్నారామె.
గతంలో వస్తు సేవల పన్నును గబ్బర్ సింగ్ టాక్స్ అని అభివర్ణించిన ప్రతిపక్ష నేతలు.. ఇప్పుడు అదే పన్ను వ్యవస్థలో మార్పుల క్రెడిట్‌ను ఖాతాలో వేసుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘GST 2.0 అనేది ప్రజల కోసం, వ్యాపారాల కోసం తీసుకున్న నిర్ణయం. ఇది రాజకీయ విమర్శలకు సమాధానం కాదు. కానీ, గతంలో దీనిని ‘గబ్బర్ సింగ్ టాక్స్’ అని పిలిచినవాళ్లే ఇప్పుడు దీన్ని తమ విజయం అని చెప్పుకోవడం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది అని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ అన్నారు.
అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ పాలనలో దీన్ని ఎందుకు అమలు చేయలేకపోయిందో చెప్పాలి? అని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ పాలనలో GST అమలు చేయడం అసాధ్యమని భావించిందని, కానీ మోదీ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసి, ఇప్పుడు రెండో దశ సంస్కరణలు కూడా తీసుకువస్తోందని పేర్కొన్నారు.
పన్ను శ్లాబ్‌ల సరళీకరణ, 5% & 18% ప్రధాన శ్లాబ్‌లు, 40% సిన్ టాక్స్ (తంబాకూ, లగ్జరీ వస్తువులపై) GST 2.0లో కీలక మార్పులని చెప్పొచ్చు. అయితే.. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దీనిని ఆయుధంగా చేసుకునే ప్రతిపక్షాలు ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
జీఎస్టీ 2.0పై స్పందించిన కాంగ్రెస్ నేతలు.. ఇది రాహుల్ గాంధీ 2016లో సూచించిన 18% GST క్యాప్ను అనుసరించడమే అని పేర్కొన్నారు. GST 2.0లో సాధారణ వినియోగదారులకు ప్రయోజనం కలగాలన్న ఉద్దేశంతో తీసుకున్న చర్యలపై తమ పాత్రను గుర్తు చేశారు.
ఇదిలా ఉంటే.. జీఎస్టీని గబ్బర్ సింగ్ టాక్స్ అని మొదటగా పిలిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ. 2017 అక్టోబర్‌లో గుజరాత్ గాంధీనగర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్య చేశారు. జీఎస్టీలో 28% అత్యధిక పన్ను ఉంది, మూడు రిటర్న్ ఫారమ్‌లు ఉన్నాయి. ఇది ప్రజలపై భారం పెడుతోంది. ఇది గబ్బర్ సింగ్ టాక్స్‌లా ఉంది అని అన్నారాయన.
బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ షోలేలోని విలన్ గబ్బర్ సింగ్ లాగా, ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తోందన్న ఉద్దేశంతో ఆయన పై వ్యాఖ్య చేశారు. GST అమలులో బహుళ పన్ను శ్లాబ్‌లు, క్లిష్టమైన కంప్లయన్స్ విధానం ఉండటం వల్ల చిన్న వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ సమయంలో ప్రతిపక్షాలు ఆరోపించాయి కూడా.