హృదయాన్ని కలచివేస్తోంది: 2 రోజుల పాటు తల్లి శవంతో ఆ చిన్నారి

Girl Found Near Dead Mother, Rescued in Odisha - Sakshi

అనారోగ్యంతో మంచానపడిన కన్న తల్లి మృతి 

చనిపోయినట్లు తెలియకపోవడంతో తల్లి శవంతో చిన్నారి 2 రోజుల జీవనం 

బొలంగీరులో వెలుగుచూసిన హృదయ విదారక ఘటన

భువనేశ్వర్‌/బొలంగీరు: తల్లి ఒడి ప్రతి బిడ్డకు అమోఘం. ప్రాణం లేకున్నా తల్లి ఒడిని వీడేందుకు ఇష్టపడని ఓ చిన్నారి ఏకంగా 2 రోజుల పాటు తల్లి శవంతో కలిసి జీవించడం హృదయాన్ని కలచివేస్తోంది. బొలంగీరు సగరపడా శివాలయం దగ్గర ఈ హృదయ విదారక సంఘటన సోమవారం వెలుగుచూసింది. ఇళ్లల్లో పాచి పనులు చేసుకుని తన మూడేళ్ల పాపని పోషించుకుంటున్న కున్ని నాయక్‌ కొన్నిరోజుల క్రితం అనారోగ్యంతో మంచానపడింది. సరిగ్గా రెండు రోజుల క్రితం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె చనిపోయింది. ఈ విషయం ఎరుగని ఆ పసిబిడ్డ తల్లి పడుకునే ఉందనుకుని మృతదేహంతో నిద్రాహారాలు మానేసి 2 రోజులు గడిపింది. మూడో రోజు నాటికి తన అమ్మ నోటి నుంచి పురుగులు బయటకు రావడంతో కంగారుపడిన ఆ పసిబిడ్డ ఇరుగుపొరుగు వారికి ఈ విషయం తెలియజేసింది. దీంతో తన తల్లి చనిపోయిన వాస్తవం బయటపడింది. 

ఇది తెలుసుకుని కన్నీరుమున్నీరవుతున్న ఆ పసికందు అమ్మా లే అమ్మ.. అమ్మా లే అమ్మ.. నాకు అమ్మ కావాలి.. అని ఆ బాలిక ఏడుపు విన్నవారి గుండె బరువెక్కింది. చిన్న బిడ్డకు ఎంత పెద్దకష్టం వచ్చిందని, ఈ పసిపాప ఆలనా పాలనా ఎవరు చూసుకుంటారని తల్లడిల్లుతున్నారు. 

చదవండి: (దేవుడా ఎంతపని చేశావయ్యా.. పెళ్లై నెలైనా కాలేదు.. ఇంతలోనే)

వివరాలిలా ఉన్నాయి.. 
భర్త మరణించిన తర్వాత పుట్టినింటి వారు, మెట్టినింటి వారు నిరాకరించడంతో కున్ని నాయక్‌ బతుకు వీధిన పడింది. చేత చిన్నారి పసి పాపను పట్టుకుని బొలంగీరు సగరపడా ప్రాంతంలోని శివాలయం దగ్గర ఒకేఒక్క గది ఉన్న ఇంట్లో అద్దెకు చేరింది. ఆ ఇంటా ఈ ఇంటా పాచి పనులు చేసుకుని ఇరుగుపొరుగు వారి ఆదరణతో జీవితం సాగనంపింది. ఇలా ఏడాదిన్నర గడిచేసరికి కున్ని తరచూ అనారోగ్యం బారినపడేది. ఎప్పటిలాగే ఒంట్లో బాగోలేకపోవడంతో కున్ని నాయక్‌ నిద్రపోయింది. అలా నిద్రలోనే ఉంటుండగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె ప్రాణాలు విడిచింది. ఇది తెలియని ఆ పసి బిడ్డ ఇరుగుపొరుగు వారు అమ్మ ఏదని అడిగితే ఒంట్లో బాగోలేక అమ్మ నిద్ర పోతుందని చెప్పేది. ఉదయం తన తల్లి నోటి నుంచి పురుగులు వస్తున్న విషయం బయటకు రావడంతో తన తల్లి చనిపోయినట్లు తెలుసుకుని ఆ పసి హృదయం రోదించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి మృతదేహం తరలించారు.  

చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top