గాల్వాన్‌ అమర జవాన్‌ తండ్రికి అవమానం.. ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చిన పోలీసులు

Galwan Martyred Soldier Father Thrashed,Arrested By Bihar Police - Sakshi

రెండేళ్ల కిత్రం గాల్వాన్‌ లోయలో చైనాతో జరిగిన హింసాత్మక ఘర్షణలో అమరుడైన బిహార్‌ సైనికుడు జై కిషోర్‌ సింగ్‌ తండ్రికి అవమానకర ఘటన ఎదురైంది. ప్రభుత్వ స్థలంలో కొడుకు కోసం స్మారకాన్ని నిర్మించినందుకు సింగ్‌ తండ్రిపై బిహార్‌ పోలీసులు అమానుషంగా ప్రవరించారు. ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి దూషించారు. అనంతరం అతన్ని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.

అసలేం జరిగిందంటే.. వైశాలి జిల్లా జండాహాలోని కజారి బుజుర్గ్‌ గ్రామానికి చెందిన రాజ్‌ కపూర్‌ సింగ్‌ కుమారుడు జై కిషోర్‌ సింగ్‌ 2020లో గాల్వన్‌ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో అమరుడయ్యాడు. గతేడాది  ఫిబ్రవరిలోనే సింగ్‌ కుటుంబ సభ్యులు తమ ఇంటి ముందు ఉన్న ప్రభుత్వ భూమిలో సైనికుడి స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. దీనిని  ఆవిష్కరించే కార్యక్రమంలో అనేకమంది ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. అనంతరం గతేడాది డిసెంబర్‌లో దీని చుట్టూ గోడ కట్టారు.

అయితే ప్రభుత్వ భూమిలో అక్రమంగా స్మారకం ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ సోమవారం అర్థరాత్రి పోలీసులు రాజ్‌ కపూర్‌ సింగ్‌ ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి అతనిపై చేయిచేసుకున్నారు. అంతేగాక సింగ్‌ను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.ఇందులో పోలీసులు సైనికుడి తండ్రి రాజ్ కపూర్ సింగ్‌ను ఇంట్లో నుంచి ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది.. అంతేగాక పోలీసులు సింగ్‌ను కొట్టారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అరెస్ట్‌ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్మారక స్తూపం వద్దకుచ ఏరుకొని పోలీసుల చర్యకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.

ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా స్మారకం ఏర్పాటు చేశారని రాజ్‌ కపూర్‌ సింగ్‌ ఇంటి పక్కనే ఉండే హరినాథ్ రామ్ ఫిర్యాదు చేశారని తెలిపారు. తన భూమితోపాటు ప్రభుత్వ భూమిలో  అనుమతులు లేకుండా  విగ్రహాన్ని నిర్మించారని చెబుతూ.. హరినాథ్‌ రామ్‌ ఫిర్యాదు ఆధారంగా  రాజ్‌ కపూర్‌ సింగ్‌పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌డిపిఓ మహువా తెలిపారు. అంతేగాక సైనికుడి స్మారకం కారణంగా పొరుగువారు తమ పొలాల్లోకి వెళ్లకుండా అయ్యిందని గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ఆర్మీలో పనిచేస్తున్న అమరవీరుడు సైనికుడి సోదరుడు నంద కిషోర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. డీఎస్పీ తమ ఇంటికి వచ్చి 15 రోజుల్లో విగ్రహాన్ని తొలగించాలని  చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే గత రాత్రి జండాహా పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి తమ ఇంటికి వచ్చి తండ్రిని అరెస్టు చేసి లాక్కెళ్లరని తెలిపారు. తండ్రిని చెంపదెబ్బ కొట్టి దుర్భాషలాడారని, పోలీస్‌ స్టేషన్‌లోనూ దాడి చేశారని ఆరోపించారు. అర్థరాత్రి ఇంటికి వచ్చి ఒక తీవ్రవాదిలా అరెస్ట్‌ చేశారని వాపోయారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top