‘చలో ఢిల్లీ’ రణరంగం

Farmers brave water cannons and tear gas as they inch towards Delhi - Sakshi

పంజాబ్‌–హరియాణా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత

ఢిల్లీకి వస్తున్న రైతులపై వాటర్‌ కెనన్ల ప్రయోగం

న్యూఢిల్లీ/చండీగఢ్‌: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు గురువారం చేపట్టిన ‘చలో ఢిల్లీ’కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రధానంగా బీజేపీ పాలిత హరియాణా, కాంగ్రెస్‌ పాలిత పంజాబ్‌ సరిహద్దులో పరిస్థితి రణరంగాన్ని తలపించింది. రైతులపై పోలీసులు బాçష్ఫవాయువు, వాటర్‌కెనన్లు ప్రయోగించారు. పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా పంజాబ్‌ రైతులు ఢిల్లీకి బయలుదేరారు.

సాయంత్రానికి పెద్ద సంఖ్యలో పంజాబ్, హరియాణా రైతులు ఢిల్లీ సమీపంలోకి చేరుకోగలిగారు. అక్కడ వారిని పోలీసులు నిలువరించారు. రైతుల ఆందోళనతో ఢిల్లీ శివార్లలో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఢిల్లీకి బయలుదేరిన స్వరాజ్‌ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ను, ఇతర నిరసనకారులను గుర్గావ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంమీద పోలీసులు మొదటి రోజు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని భగ్నం చేయగలిగారు.

రైతన్నలపై పోలీసుల జులుం
పంజాబ్‌–హరియాణా షాంబూ సరిహద్దులో హరియాణా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. పంజాబ్‌ రైతులు ట్రాక్టర్లలో అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రైతులు వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. కానీ, రైతులు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు కదిలారు. వారిని చెదరగొట్టడానికి హరియాణా పోలీసులు భాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించారు. కోపోద్రిక్తులైన రైతులు కొన్ని బారికేడ్లను ఘగ్గర్‌ నదిలో విసిరేశారు. అంతేకాకుండా సిర్సా, కురుక్షేత్ర, ఫతేబాద్, జింద్‌ జిల్లాల్లోనూ రైతులు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి.

గురువారం సాయంత్రానికి ఉద్రిక్తతలు చల్లారాయి. చాలా ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలను సడలించడంతో రైతులు కాలినడకన, ట్రాక్టర్లపై ముందుకు కదిలారు. అమృత్‌సర్‌–ఢిల్లీ ప్రధాన రహదారిపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కర్నాల్‌ పట్టణంలోనూ రైతులను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్‌ కేనన్లను ప్రయోగించారు. హరియాణాలోని కైథాల్‌ జిల్లాలో భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు వాటర్‌ కెనన్లను ప్రయోగించారు. శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళుతున్న తమపై పోలీసులు బల ప్రయోగం చేయడం ఏమిటని రైతన్నలు మండిపడ్డారు.

పంజాబ్‌–హరియాణా సరిహద్దుల్లో అంబాలా వద్ద రైతులపైకి వాటర్‌ కేనన్ల ప్రయోగం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top