ముంబై: దేశంలోని ప్రముఖ అణు పరిశోధనా విభాగం భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఈ కేంద్రంలో పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్న ఒక నకిలీ శాస్త్రవేత్తను అరెస్టు చేయడానికి తోడు, అతని నుంచి అనుమానిత న్యూక్లియర్ డేటా, 14 మ్యాప్‌లను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాలలో ఏదైనా గోప్యమైన న్యూక్లియర్ డేటా ఉన్నదీ లేనిదీ తెలుసుకునే దిశగా దర్యాప్తు ప్రారంభించారు.
అక్తర్ కుతుబుద్దీన్ హుస్సేని అనే నకిలీ శాస్త్రవేత గత వారం ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో అరెస్టు అయ్యాడు. అతను వివిధ పేర్లతో శాస్త్రవేత్తగా నటిస్తూ వస్తున్నాడు. అతని నుండి పోలీసులు పలు నకిలీ పాస్‌పోర్ట్‌లు, ఆధార్, పాన్ కార్డులు, నకిలీ బార్క్ ఐడీలు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఐడీలో అతను అలీ రజా హుస్సేన్‌గా, మరొక దానిలో అతని పేరు అలెగ్జాండర్ పామర్ అని ఉందని పోలీసులు గుర్తించారు. హుస్సేని గత కొన్ని నెలలుగా పలు అంతర్జాతీయ కాల్స్ చేశాడని, అతని కాల్ రికార్డులను గుర్తించామని పోలీసు వర్గాలు తెలిపాయి. అనుమానిత న్యూక్లియర్ డేటాతో ముడిపడిన విదేశీ నెట్‌వర్క్‌లతో హుస్సేని సంబంధం కలిగి ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారని ఎన్‌డీటీవీ తన కథనంలో పేర్కొంది.
హుస్సేని తన గుర్తింపును మార్చుకుని మారువేషంలో చాలాకాలంగా ఉంటున్నాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 2004లో రహస్య పత్రాలు కలిగిన శాస్త్రవేత్తగా గుర్తించి, అతనిని దుబాయ్ నుండి బహిష్కరించారు. అయితే ఆ తర్వాత కూడా అతను నకిలీ పాస్‌పోర్ట్‌లను ఉపయోగించి దుబాయ్, టెహ్రాన్ తదితర దేశాలలో ప్రయాణాలు సాగించాడు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన అఖ్తర్ హుస్సేని 1996లో తన పూర్వీకుల ఇంటిని విక్రయించాడు. అయితే తన పాత పరిచయాల సహాయంతో నకిలీ పత్రాలను రూపొందించాడని పోలీసులు తెలిపారు. ఈ నేపధ్యంలోనే అతను హుస్సేని మొహమ్మద్ ఆదిల్, నసీముద్దీన్ సయ్యద్ ఆదిల్ హుస్సేని పేర్లతో రెండు నకిలీ పాస్‌పోర్ట్‌లను పొందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జంషెడ్‌పూర్ చిరునామాతో ఈ పాస్‌పోర్టులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: రహస్య కెమెరాలో పోలీసు అధికారిణి.. ఏం చేస్తూ దొరికారంటే..


