తిరువనంతపురం: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో బంగారం చోరీ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తాజాగా ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధీష్ కుమార్‌ను ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)అధికారులు.. సుధీష్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని, విచారించిన దరిమిలా ఈ అరెస్ట్ జరిగింది.
ఆలయ ద్వారం వద్దనున్న శిల్పాలకు పూత పూసిన పొరలు బంగారంతో తయారు చేసినవని తెలిసినప్పటికీ, సుధీష్ కుమార్ అధికారిక పత్రాలలో వాటిని రాగి పొరలుగా తప్పుగా నమోదు చేసినట్లు దర్యాప్తు అధికారులు కనుగొన్నారని ఎన్‌డీటీవీ తన కథనంలో పేర్కొంది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి మహసర్ (అధికారిక రికార్డు)ను ట్యాంపరింగ్ చేసి, బంగారాన్ని దొంగిలించేందుకు సుధీష్ కుమార్ సహాయం చేశాడని సిట్ నిర్ధారించింది. 2019లో శబరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరించిన సుధీష్ నాడు ఉన్నికృష్ణన్ పొట్టిని దాతగా ఆమోదించారు. దీనికితోడు దేవస్వం బోర్డు ఆ బంగారు పొరలను రాగి పలకలుగా చెప్పాలంటూ ఉన్నికృష్ణన్ పొట్టిని కోరిందని సిట్ గుర్తించింది. అధికారులు శిల్పాలను ట్యాంపరింగ్ చేసినప్పుడు కూడా, సుధీష్ వాటిని రికార్డులలో రాగి పొరలుగా పేర్కొన్నారు.
అయితే పొట్టికి ఆ షీట్లు అందకపోయినా, సుధీష్ అతని పేరును రికార్డులలో రాశారని చూపించే ఆధారాలను సిట్ స్వాధీనం చేసుకుంది. సుధీష్ మరో నిందితుడు మురారి బాబుకు ఈ బంగారం చోరీలో సహాయం చేశాడని కూడా దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. సుధీష్ కుమార్‌ను అధికారులు (ఈరోజు) శనివారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. తదుపరి విచారణ కోసం అతనిని తిరిగి కస్టడీకి కోరే అవకాశం ఉందని సమాచారం.


