సాక్షి, ఢిల్లీ: ఎర్రకోట పేలుడు కేసులో అల్‌ఫలా యూనివర్సిటీపై మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) దాడులు చేపట్టింది. యూనివర్సిటీకి అందుతున్న నిధులపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. విశ్వవిద్యాలయానికి, నిషేధిత ఉగ్రవాద సంస్థలకు మధ్య ఉన్న అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల చిట్టాను ఛేదించే లక్ష్యంతో ఢిల్లీ, ఫరీదాబాద్‌లలో ఏకకాలంలో 25 వేర్వేరు ప్రాంతాల్లో ఈడీ బృందాలు మెరుపుదాడులు నిర్వహించాయి.
అల్‌ఫలా విశ్వవిద్యాలయం యజమానులు, సంబంధిత వ్యక్తులపై ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసింది. విశ్వవిద్యాలయం ఆర్థిక లావాదేవీలు, ఫీజుల వసూళ్లు, నిధుల మళ్లింపు తదితర అంశాలపై దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ జరుపుతోంది. ఈ దాడులలో కీలకమైన పత్రాలు, డిజిటల్ ఆధారాలు, ఆర్థిక వివరాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు హమాస్ తరహాలో డ్రోన్ ఆయుధాలతో దాడులకు ఉగ్రవాదుల ప్లాన్ చేశారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
ఈ నేపధ్యంలో అధికారులు డ్రోన్లు, పలు ఆయుధాలను కనుగొన్నారు. సూసైడ్ బాంబర్ ఉమర్ నబి సహచరుడు జహీర్ బిలాల్ వాణి అలియాస్ డానిష్ అరెస్టు దరిమిలా డ్రోన్ల దాడి ప్రణాళిక వెల్లడయ్యింది. డ్రోన్లకు ఆయుధాలు బిగించడంలో డ్యానిష్ సాంకేతిక సహకారం అందించాడని తేలింది. కారు బాంబు దాడికి ముందు డ్రోన్లకు రాకెట్లు ఉపయోగించాలని ప్రణాళికలు రూపొందించారని సమాచారం.
రోడ్లకు పవర్ఫుల్ బ్యాటరీలు ఉపయోగించి భారీ ఆయుధాలు, కెమెరాలను బిగించాలని ప్లాన్ చేశారని తెలుస్తోంది. భారీ ఎత్తున జనం ఉన్న ప్రాంతాలలో డ్రోన్ల ద్వారా దాడులు చేయాలని ముష్కరులు ప్లాన్ చేశారని ఎన్‌ఐఏ అధికారులు కనుగొన్నారు. 2023లో ఇదే తరహాలో ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేశారని అధికారులు చెబుతున్నారు.


