శత్రు సైన్యంపై మూషికాస్త్రం!

DRDO scientists make rat cyborgs for security forces intelligence surveillance - Sakshi

డీఆర్‌డీఓ వినూత్న ప్రయోగాలు 

ఎలక్ట్రానిక్‌ పరికరాలతో ఎలుకల సామర్థ్యం పెంపు 

మొదటి దశ ప్రయోగం విజయవంతం

యుద్ధ క్షేత్రంలో శత్రు శిబిరం ఎత్తుగడలు, రహస్యాలను తెలుసుకోవడానికి సైన్యం రకరకాల మార్గాల్లో ప్రయత్నించడం తెలిసిందే. శత్రువులు ఎక్కడెక్కడ ఏయే ఆయుధాలు మోహరించారో తెలుసుకోవడం యుద్ధంలో కీలకం. ఇలాంటివి పసిగట్టే ఎలుకలపై భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) నిర్విరామంగా ప్రయోగాలు సాగిస్తోంది. డీఆర్‌డీఓలో అంతర్భాగమైన అసిమ్మెట్రిక్‌ టెక్నాలజీ ల్యాబ్‌ ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమైంది. మొదటి దశను విజయవంతంగా పూర్తిచేసి, రెండో దశలోకి ప్రవేశించింది.   

ఏమిటీ ప్రయోగం?  
సైనికులు జంతువులు, పక్షులను ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదు. రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేసే ఎలుకలను రంగంలోకి దించాలన్నదే భారత సైన్యం వ్యూహం. ఇవి ఏమాత్రం అనుమానం రాకుండా శత్రు సైనికుల శిబిరాల్లోకి వెళ్లి, అక్కడి సమాచారాన్ని అందిస్తాయి. ఆ సమాచారం ఆధారంగా సైన్యం వ్యూహాలు సిద్ధం చేసుకోవచ్చు. ఈ ఎలుకలను యానిమల్‌ ౖసైబర్గ్స్‌ అని పిలుస్తున్నారు. ఏడాదిన్నర క్రితమే ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. దీనిగురించి ఇటీవల జరిగిన 108వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌లో డీఆర్‌డీఓ సైంటిస్టు పి.శివప్రసాద్‌ ఒక ప్రజంటేషన్‌ ఇచ్చారు.  

యానిమల్‌ సైబర్గ్స్‌ అంటే?  
జీవించి ఉన్న ఎలుకల సామర్థ్యాన్ని మరింత పెంచుతారు. ఇందుకోసం ఎలక్ట్రికల్, మెకానికల్‌ పరికరాలు ఉపయోగిస్తారు. సాధారణ ఎలుకలు చేయలేని ఎన్నో పనులను ఇవి సులువుగా చేసేస్తాయి. కేవలం సైన్యంలోనే కాదు, పరిశోధనలు, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, భూమిల పాతిపెట్టిన బాంబుల జాడ కనుక్కోవడంతోపాటు శస్త్రచికిత్సల్లోనూ యానిమల్‌ సైబర్గ్స్‌ సేవలను వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ జంతువుల్లో మార్పులు చేయడాన్ని జంతు ప్రేమికులు, జంతు హక్కుల సంఘాల కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. జంతువుల్లోని సహజ సామర్థ్యాలను దూరం చేయడం వాటిని బాధకు గురిచేయడమే అవుతుందని అంటున్నారు.   

ఎలుకలే ఎందుకు?  
భారత్‌లో ఎలుకలపై మొదటి దశ ప్రయోగాలు ముగిశాయి. ఎలుకల కదలికలను నియంత్రించడానికి సర్జరీల ద్వారా వాటి శరీరంలో ఎలక్ట్రోడ్‌లు అమర్చారు. ఇక సాధారణ వాతావరణ పరిస్థితుల్లో వాటిని పరీక్షించబోతున్నారు. కొండలను ఎంత వరకు అధిరోహించగలవో చూస్తారు. మొదటి దశ ప్రయోగంలో ఎలుకలు కొంత ఇబ్బందికి గురయ్యాయని డీఆర్‌డీఓ సైంటిస్టు పి.శివప్రసాద్‌ వెల్లడించారు. కార్యాచరణకు సిద్ధమైన ఎలుకలను రిమోట్‌ కంట్రోల్‌తో నియంత్రించవచ్చు. ఏ దిశగా వెళ్లాలి? ఎంత దూరంగా వెళ్లాలి? ఎక్కడ ఆగాలి? ఎంతసేపు ఆగాలి? అనేదానిపై వాటి మెదడుకు ఎప్పటికప్పుడు సంకేతాలు అందిస్తారు. ప్రయోగానికి ఎలుకలనే ఎన్నుకోవడానికి కారణంగా ఏమిటంటే.. అవి వేగంగా కదులుతాయి. లోతైన బొరియల్లోకి సైతం తేలిగ్గా వెళ్లగలవు. గోడలు, చెట్లు ఎక్కగలవు. యానిమల్‌ ౖౖసైబర్గ్స్‌ను చైనాలో ఇప్పటికే అభివృద్ధి చేశారు. యానిమల్‌ సైబర్గ్స్‌ సినిమాల్లో కూడా ఉన్నాయి. స్టార్‌వార్స్‌ సినిమాలోని చ్యూబాకా కూడా ఇలాంటిదే. ఒళ్లంతా రోమాలతో కనిపించే వింత జంతువు చ్యూబాకాలో శరీరం లోపల ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఉంటాయి.

–సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top