
దేశవ్యాప్తంగా వీధుల్లో కుక్కల బెడద
11 సెకన్లకో కుక్క కాటు కేసు నమోదు
2024లో దేశంలో 37 లక్షలకుపైగా కేసులు
చర్చకు తెరలేపిన ‘సుప్రీం’ ఆదేశాలు
వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి.. పిచ్చి కుక్క కరిచి పది మందికి గాయాలు.. ఇలాంటి వార్తలు నిత్యం మనకు కనిపిస్తుంటాయి, వినిపిస్తుంటాయి. వీధి కుక్కల ముప్పు ఒక్క ప్రాంతానికో, నగరానికో పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. కుక్కకాటు సంఘటనలు మూడేళ్లలో 70 శాతం పెరిగాయంటే సమస్య తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్ సీఆర్) పరిధిలోని అన్ని కుక్కలను ఎనిమిది వారాల్లోగా షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చకు వచ్చింది.
– సాక్షి, స్పెషల్ డెస్క్
చాలామంది రాత్రుళ్లు వీధుల్లో నడవడానికి, బైక్‌మీద వెళ్లడానికి భయపడతారు. ఉదయం మార్నింగ్ చేసేటప్పుడు చాలామంది కర్రలు పట్టుకుంటారు. వీటన్నింటికీ కారణం.. గ్రామ సింహాలు. బైక్ మీద వేగంగా వెళ్తుంటే కుక్కలు వెంటపడి, కరిచి లేదా వారు కిందపడి ఎంతో మంది గాయపడిన సంఘటనలు ఉన్నాయి. మనదేశంలో కుక్కల ప్రతాపం చవిచూడని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు.
సుమారు 70 శాతం పెరిగాయి
కుక్కకాటు సంఘటనలు 2024లో దేశంలో 37 లక్షలకుపైగా నమోదయ్యాయి. మూడేళ్లలో ఈ ఘటనలు 69.6 శాతం పెరిగాయి. ఈ ఏడాది జనవరిలోనే 4.29 లక్షల కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా రేబీస్ అనుమానిత కేసులు భారీగా తగ్గుతూ వచ్చాయి. 2022తో పోలిస్తే గత ఏడాది ఈ కేసులు 78 శాతం క్షీణించాయి.
కానీ మరణాలు మాత్రం ఊహించని స్థాయిలో అధికం అయ్యాయి. రెండేళ్లలో ఎనిమిది రెట్లకుపైగా పెరిగి జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. గత ఏడాది వీధి కుక్కల దాడి కారణంగా రేబీస్‌తో భారత్‌లో 180 మంది మరణించగా.. వీరిలో అత్యధికంగా మూడింట రెండొంతులు దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉండడం గమనార్హం.
11 సెకన్లకు ఒకటి..
భారతదేశంలో 6 కోట్లకు పైగా వీధి కుక్కలు ఉన్నాయని అంచనా. వీటిలో చాలా తక్కువ మాత్రమే సహజ మరణాలకు గురవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంటే వ్యాధులతో మరణించేవే అధికం అన్నమాట. దేశంలో ప్రతి 11 సెకన్లకు ఒకరిని కుక్క కరిచిన సంఘటనలు నమోదవుతున్నాయి. దాదాపు 5,000 ఘటనలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. కుక్కల ద్వారా ప్రజలకు 60కి పైగా వ్యాధులు వ్యాపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం కుక్కల దాడి వల్ల రేబీస్ సోకి గత ఏడాది 180 మంది ప్రాణాలను బలిగొంది. ఈ వీధి కుక్కలు భారతీయ రోడ్లు, పొలాల్లో రోజూ 15,000 టన్నులకు పైగా మలం, 8 మిలియన్ గ్యాలన్ల మూత్రం విడుదల చేస్తున్నాయి. ఇది ఒక ప్రధాన ఆరోగ్య, పర్యావరణ సమస్య అన్నది వైద్యుల మాట. ఇక, పెంపుడు కుక్కలు దేశంలో 3 కోట్లకుపైచిలుకు ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి.

» భారతదేశంలో 6 కోట్లకు పైగా వీధి కుక్కలు ఉన్నాయని అంచనా.
» దేశంలో ప్రతి 11 సెకన్లకు ఒకరిని కుక్క కరిచిన సంఘటనలు నమోదవుతున్నాయి.
» దాదాపు 5,000 ఘటనలు ప్రాణాంతకంగా మారుతున్నాయి.
» కుక్కల ద్వారా ప్రజలకు 60కి పైగా వ్యాధులు వ్యాపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేశవ్యాప్తంగా కుక్క కాటు సంఘటనలు
2022 21,89,909
2023 30,52,521
2024 37,15,713
