అక్టోబర్‌ 31 వరకూ స్కూల్స్‌ మూసివేత

Delhi Schools To Remain Shut Till October 31 - Sakshi

పున:ప్రారంభం ఇప్పట్లో కష్టమే!

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ నేపథ్యంలో ఢిల్లీలో అన్ని స్కూల్స్‌ మూసివేత అక్టోబర్‌ 31 వరకూ కొనసాగుతుందని డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా స్పష్టం చేశారు. దేశ రాజధానిలో ఈనెల 5 తర్వాత స్కూళ్లు తెరుస్తారని ఢిల్లీ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్‌ 31 వరకూ స్కూల్స్‌ను తెరవబోమని, ఆన్‌లైన్‌ క్లాసులు యథాతథంగా జరుగుతాయని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఓ తండ్రిగా పరిస్థితి తీవ్రతను తాను అర్థం చేసుకోగలనని, ఈ సమయంలో పిల్లల ఆరోగ్యంతో రిస్క్‌ చేయడం సరైంది కాదని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారని సిసోడియా ఆదివారం ట్వీట్‌ చేశారు.

కాగా అక్టోబర్‌ 15 తర్వాత దశలవారీగా స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్ధల పున:ప్రారంభంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఓ నిర్ణయం తీసుకుంటాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన అన్‌లాక్‌ 5 మార్గదర్శకాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక స్కూల్స్‌ను తిరిగి తెరిస్తే విద్యార్ధులకు అటెండన్స్‌ను తప్పనిసరి చేయరాదని, తల్లితండ్రుల అనుమతితోనే విద్యార్ధులను స్కూళ్లకు రప్పించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించడంతో మార్చి నుంచి విద్యాసంస్ధలన్నీ మూతపడ్డాయి. అయితే వైరస్‌ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో స్కూళ్ల పున​:ప్రారంభంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top