
ఇండోర్‌లో మాజీ న్యాయమూర్తి ఇంట్లో దోపిడీ
ఇండోర్: ముఖాలకు ముసుగులు, చేతులకు గ్లోవ్స్ ధరించిన ముగ్గురు దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. ఏకంగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లారు. బెడ్‌మీద నిద్రపోయిన వ్యక్తి లేస్తే.. కొట్టడానికి సిద్ధంగా ఒకరు చేతిలో రాడ్ పట్టుకుని ఉండగా.. మరొకరు బీరువాలో ఉన్న సొమ్మును దొంగిలించారు. ఇంకొకరు డోర్ దగ్గర కాపలాగా ఉన్నారు. దాదాపు 20 నిమిషాల పాటు ప్రశాంతంగా ఇంటిని దోచుకున్నారు. అయితే.. హెచ్చరిక అలారం మోగినప్పటికీ ఇంట్లో ఉన్న వ్యక్తి నిద్ర లేవలేదు. దుండగులు రూ.లక్షల నగదు, విలువైన వస్తువులను తీసుకెళ్లారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గౌహతి హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రమేష్ గార్గ్ ఇంట్లో జరిగిన దోపిడీ.
ఈ ఘటనంతా ఇంట్లోని బెడ్‌రూమ్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. దోపిడీ జరిగిన సమయంలో అతని కుటుంబం గాఢ నిద్రలో ఉంది. ఈ సంఘటన రక్షా బంధన్ రోజున జరిగింది. అదే రోజు సమీపంలోని అనేక ప్రాంతాల్లో దోపిడీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను స్వా«దీనం చేసుకోగా విషయం వెలుగులోకి వ చ్చింది. అన్ని చోట్లా దొంగలు ముసుగులు, చేతులకు గ్లోవ్స్ ధరించి ఉన్నారు. దొంగతనాలు చాలా పద్ధతిగా చేసినట్లు కనిపిస్తోంది. దీంతో.. వీటిపై దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.