క‌రోనా ప‌రీక్ష‌ల‌ను రెట్టింపు చేస్తామ‌న్న ఢిల్లీ సీఎం

As Covid Cases Rising CM  Arvind Kejriwal Says Testing Will Be Doubled - Sakshi

సాక్షి, ఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా ప‌రీక్ష‌ల‌ను రెట్టింపు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ బుధ‌వారం ప్ర‌క‌టించారు. గ‌త కొన్ని రోజులుగా ఢిల్లీలో క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరుగుతుండటంతో టెస్టింగ్ కెపాసిటీ పెంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. రాష్ర్టంలో ప్ర‌స్తుతం రోజుకు 20 వేల‌కు పైగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని, ఇప్పుడు ఈ సంఖ్య‌ను 40 వేల‌కు పెంచుతున్న‌ట్లు సీఎం స్ప‌ష్టం చేశారు. గ‌త 24 గంట‌ల్లో 1,544 కొత్త  కేసులు నమోదయిన‌ప్ప‌టికీ, ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌ని కేజ్రివాల్ అన్నారు. ఇత‌ర అంశాలును ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే అవన్నీ కూడా అదుపులోనే ఉన్నాయని తెలిపారు. ఒక‌ప్పుడు వేల‌ల్లో వ‌చ్చే క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గ‌డంతో ప్ర‌స్తుతం ఢిల్లీ ప్రజలు చాలా ధీమాగా ఉన్నారని, అయితే ఇక్కడితో సంతృప్తి పడరాదని కోరారు. త‌ప్ప‌నిసరిగా మాస్కులు ధ‌రించ‌డం, సామాజిక దూరం పాటించడం లాంటి నియమాల‌ను పాటించాల‌ని సూచించారు. (జర్నలిస్టులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా)

ఏమాత్రం క‌రోనా లక్ష‌ణాలు క‌నిపించినా ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని, ఇందులో సిగ్గుప‌డాల్సిన విష‌యం ఏమీ లేద‌ని పేర్కొన్నారు. ల‌క్ష‌ణాలు ఉన్నా క‌రోనా టెస్ట్ చేయించుకోకుంటే మీతో పాటు మీ చుట్టుప‌క్క‌న వారిని కూడా ప్ర‌మాదంలోకి నెట్టేసిన‌ట్లే అవుతుంద‌ని అన్నారు. హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌వారితో డాక్ట‌ర్లు నిత్యం సంప్ర‌దింపులు జ‌రిపి వారి ఆరోగ్య ప‌రిస్థితిని స‌మీక్షించాల‌ని, ఆక్సీమీట‌ర్ల‌ను ఇంటికే పంపాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

గ‌త కొన్ని వారాలుగా త‌గ్గుముఖం ప‌ట్టిన కోవిడ్ తీవ్ర‌త కొన్నిరోజుల నుంచి మ‌ళ్లీ అధిక‌మ‌య్యింది. ఢిల్లీలో కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్నాయి. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే 1544 కొత్త క‌రోనా కేసులు వెలుగుచూశాయి. జూన్ చివ‌ర్లో 3400గా ఉన్న కేసుల సంఖ్య ఆగ‌స్టు మొద‌టివారం నాటికి 900కు తగ్గింది. దేశ రాజ‌ధానిలో ఇక క‌రోనా క్ర‌మంగా త‌గ్గుతుంది అనుకునే లోపే గ‌త వారం స‌గ‌టున వెయ్యికి పైగా కేసులు న‌మోదవుతుండ‌టంతో అధికారులు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం సూచించారు. సాధ్య‌మైనంత టెస్టింగ్ కెపాసిటీ పెంచి ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించాల‌ని ఆదేశించారు. (అన్‌లాక్‌ 4.0: స్కూళ్లు ఇప్పట్లో తెరుచుకోవు!)

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top