కోవాగ్జిన్‌ తీసుకున్న వలంటీర్‌ మృతి

Covaxin phase 3 volunteer Death of o vaccine trial - Sakshi

తమ వ్యాక్సిన్‌తో సంబంధం లేదన్న భారత్‌ బయోటెక్‌

భోపాల్‌: హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకా ‘కోవాగ్జిన్‌’ తీసుకున్న 42 ఏళ్ల వలంటీర్‌ మృతి చెందాడు. భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. కోవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. భోపాల్‌లోని పీపుల్స్‌ మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పిటల్‌లో డిసెంబర్‌ 12న కోవాగ్జిన్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా గిరిజన కూలి అయిన దీపక్‌ మర్వాయి అనే వ్యక్తికి(వలంటీర్‌) సైతం వ్యాక్సిన్‌ ఇచ్చారు.

అతడు డిసెంబర్‌ 21న మరణించాడు. అయితే, దీపక్‌ మర్వాయి విష ప్రయోగం కారణంగా మరణించినట్లు అనుమానాలు ఉన్నాయని మధ్యప్రదేశ్‌ మెడికో లీగల్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌  అశోక్‌ శర్మ చెప్పారు. అసలైన కారణమేంటో నిర్ధారించాల్సి ఉందన్నారు. కోవాగ్జిన్‌ తీసుకొని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత దీపక్‌లో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఛాతీ నొప్పితో బాధపడ్డాడని వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో డిసెంబర్‌ 21న ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే తుదిశ్వాస విడిచాడని పేర్కొన్నారు.

అసలైన వ్యాక్సిన్‌ ఇచ్చారా? లేదా?
వలంటీర్‌ దీపక్‌ మృతిపై భారత్‌ బయోటెక్‌ సంస్థ స్పందించింది. ఫేజ్‌–3 ట్రయల్స్‌లో భాగంగా అతడి అంగీకారంతోనే వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఏడు రోజుల పాటు అతడిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు, దుష్ప్రభావాలు కనిపించలేదని, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని పేర్కొంది. 9 రోజుల తర్వాత మరణించాడంటే అందుకు తమ వ్యాక్సిన్‌ కారణం కాదని ప్రాథమిక సమీక్షలో తేలినట్లు స్పష్టం చేసింది. అయితే, హ్యూమన్‌ ట్రయల్స్‌లో భాగంగా దీపక్‌ మర్వాయికి అసలైన కోవాగ్జిన్‌ ఇచ్చారా? లేక సాధారణ ఔషధం(ప్లాసిబో) ఇచ్చారా? అనేది నిర్ధారణ కాలేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top