
అసంబద్ధంగా స్పందిస్తే.. రెండు దేశాల మధ్య యుద్ధమే..
అమెరికన్ ఇంటెలిజెన్స్ హెచ్చరిక.
1980, 1990ల నాటి నివేదికలు బహిర్గతం.
భారత్, పాక్.. రెండు దేశాలూ ఒకదాని గురించి మరొకటి అంచనాలు వేయడంలో పొరపాట్లు జరిగినా లేదా రెండిట్లో ఏదో ఒక దేశం అకారణంగా అతిగా స్పందించినా... సాధారణ శతృత్వం కాస్తా అణుయుద్ధానికి దారి తీయవచ్చు! 1980, 1990ల నాటి అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదికలు ఈ ఉపద్రవాన్నే సూచిస్తున్నాయి.
కశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు బలిగొన్న నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మిన్నంటుతున్నాయి. ఇదే తరుణంలో విడుదలైన అమెరికన్ ఇంటెలిజెన్స్ రహస్య నివేదికలు మరిత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. డీక్లాసిఫై అయిన ఇంటెలిజెన్స్ నివేదికల పత్రాలను అమెరికాలోని నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్ మంగళవారం (ఈ నెల 22న) బహిర్గతం చేసింది.
నివేదికల ప్రకారం భారత్, పాక్ నడుమ యుద్ధం సంభవించే అవకాశాలు స్వల్పమే అయినప్పటికీ పరస్పరం అంచనాలు వేయడంలో ఆయా దేశాలు పొరబడినా లేదా ఉభయ దేశాల్లో ఏదో ఒకటి అహేతుకంగా ప్రతిస్పందించడమో, అసమంజస నిర్ణయాలు తీసుకోవడమో జరిగినా సంప్రదాయ వైరం కాస్తా అణుయుద్ధంగా పరిణమించవచ్చు. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 160 న్యూక్లియర్ వార్ హెడ్లు, పాక్ అమ్ములపొదిలో 165 అణు వార్ హెడ్లు ఉండవచ్చని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ అంచనా. ఆధునిక క్షిపణి వ్యవస్థలు అణుయుద్ధ ముప్పును ‘వేగవంతం’ చేస్తున్నాయి.
పాక్ క్షిపణి ‘షహీన్’ ఏడు నిమిషాల్లో న్యూఢిల్లీని చేరగలదు. అలాగే భారత్ క్షిపణి ‘ప్రళయ్’ ఆరు నిమిషాల లోపే ఇస్లామాబాద్ మీద దాడి చేయగలదు. మరో ముఖ్యాంశం... ‘నో ఫస్ట్ యూజ్’ పాలసీకి తాము కట్టుబడినట్టు భారత్ గతంలో ప్రకటించింది. ఈ ‘నో ఫస్ట్ యూజ్ న్యూక్లియర్ డాక్ట్రిన్’ ప్రకారం... భారత భూభాగంపైనో, భారత సైనిక దళాలపైనో అణుదాడి జరిగితేనే మన దేశం ప్రతీకార అణుదాడులకు ఉపక్రమిస్తుంది. అంతేతప్ప భారత్ తనంతట తానుగా, ముందుగా అణ్వాయుధాలను ఏ దేశంపైనా ప్రయోగించదు.
‘ఇండియాస్ రియాక్షన్ టు న్యూక్లియర్ డెవలప్మెంట్స్ ఇన్ పాకిస్థాన్’ శీర్షికతో ఉన్న 1981 నాటి అమెరికన్ స్పెషల్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్ (ఎస్ఎన్ఐఈ) ప్రకారం... తమ భద్రతకు తీవ్రంగా ముప్పు వాటిల్లుతుందని భావిస్తేనే భారత్ ముందస్తుగా పాక్ అణు కేంద్రాలపై దాడులు చేస్తుంది. ఇక ‘నో ఫస్ట్ యూజ్ అణు విధానం లాంటి స్వీయ నియంత్రణ, కట్టుబాట్లు మన పొరుగు దేశానికి లేవు. 2019లో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్ వద్ద బాంబులు వేసి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశాయి. అలాంటి సాధారణ, సంప్రదాయ దాడి సందర్భాల్లో పరిస్థితులను అర్థం చేసుకోకుండా పాకిస్థాన్ ఒకవేళ అసంబద్ధంగా ప్రవర్తిస్తే జరిగేది... అణుయుద్ధమే!.
ఇండియాతో మరో యుద్ధం తలెత్తితే తమ దేశం మొత్తం కాకపోయినా తమ మిలిటరీ నాశనమవుతుందని పాక్ సైనిక నాయకత్వం భయపడినట్టు 1993 నాటి సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) రహస్య నివేదిక ఒకటి వెల్లడించింది. ‘ఇండియా-పాకిస్థాన్: ప్రాస్పెక్ట్స్ ఫర్ వార్ ఇన్ ద నైంటీస్’ శీర్షికతో ఉన్న ఈ నివేదిక... భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశాలు 20% (ఐదింట ఒక వంతు) ఉన్నట్టు అప్పట్లో అంచనా వేసింది.
- జమ్ముల శ్రీకాంత్.
Conflict with India could destroy Pak military, if not the entire state : declassified CIA docs.
Recently declassified paper predicted a spectacular terror attack could increase chances of conflict, Pak would fear destruction of the state.https://t.co/PfOwuRym9A pic.twitter.com/StP3TDJPZi— Manu Pubby (@manupubby) April 24, 2025
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం దౌత్యపరమైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. అందులో సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో ప్రధాన చర్చనీయాంశమైంది. భారత్ చర్యలకు ప్రతిగా.. పాక్ కూడా భారత్‌పై పలు ఆంక్షలను విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది.