
తేజస్వి సరదా సలహా తనకూ వర్తిస్తుందన్న రాహుల్
‘ఓటర్ అధికార్ యాత్ర’ సభ అనంతరం రాహుల్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ పాల్గొన్న మీడియా భేటీ సరదా సన్నివేశాలకు, నవ్వులకు వేదికైంది. కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య చిచ్చు పెట్టేందుకు ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ప్రయత్నిస్తున్నారా అన్న ప్రశ్నకు తేజస్వి బదులిస్తూ, ఆయన ఎత్తులను చిత్తు చేస్తానని ధీమా వెలిబుచ్చారు. అయితే, ‘‘ చిరాగ్ వయసులో నాకంటే పెద్ద. పెద్దన్నయ్య వంటివాడు. అందుకే తనకు నాదో సలహా. త్వరగా పెళ్లి చేసుకుంటే మంచిది’’ అంటూ నవ్వులు పూయించారు.
‘‘నీ ఉచిత సలహాలు నాక్కూడా తగులుతున్నాయి, చూసుకో’’ అంటూ రాహుల్ చెణుకులు విసరడంతో అంతా మరోసారి గొల్లుమన్నారు. తేజస్వి అంతటితో ఆగకుండా, ‘పెళ్లి చేసుకొమ్మని మా నాన్న(లాలు) కూడా మీకిప్పటికే చాలాసార్లు చెప్పా’రన్నారు. అది నిజమేనని రాహుల్ అంగీకరించారు. ‘‘రెండేళ్లుగా లాలూజీని ఎప్పుడు కలిసినా నా పెళ్లి మాటే ఎత్తుతున్నారు. ఆయన సమక్షంలో ఇంకా నా పెళ్లి చర్చలు జరుగుతున్నాయి’’ అంటూ మరోసారి అందరినీ నవి్వంచారు. ‘‘రాహుల్ పెళ్లి గురించి ఆయన తల్లి సోనియాగాంధీతో మాట్లాడా. రాహుల్‌ను పెళ్లికొడుకుగా చూడాలని మేమంతా ఆరాటపడుతున్నాం. ఆయన బారాత్‌లో మేం డ్యాన్స్ చేయాల్సిందే’’ అని లాలు గతంలో అనడం తెల్సిందే.
బుల్లెట్ ర్యాలీలో... రాహుల్‌కు ముద్దు
అరారియాలో బుల్లెట్ ర్యాలీ సందర్భంగా ఓ యువకుడు హఠాత్తుగా దూసుకొచ్చి రాహుల్ ఎడమ భుజంపై ముద్దు పెట్టాడు! జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న రాహుల్‌కు ఓ ఆగంతకుడు అంత సమీపానికి రావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. భద్రతాధికారులు అతన్ని దూరంగా నెట్టడమే గాక చేయి కూడా చేసుకున్నారు. అనంతరం ఇంకెవరూ రాహుల్‌ను సమీపించకుండా వలయంగా మారి భద్రత కల్పించారు. అంతకుముందు కూడా ఓ బాలుడు రాహుల్ ర్యాలీగా వెళ్తున్న ఓపెన్ టాప్ కారుపైకి ఎక్కాడు.