
బిహార్‌లో అరుదైన ఘటన
విషం కారణంగా ఆస్పత్రిపాలైన పిల్లాడు
ప్రస్తుతం కోలుకుంటున్న చిన్నారి
పట్నా: బతికే రాత ఉంటే ఆకాశం నుంచి పడినా ఏమీ కాదని కొందరంటారు. విషం చిమ్మే తాచుపామును కొరికి కూడా ఏడాది వయసు పిల్లాడు బతికి బట్టకట్టిన అరుదైన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. బొమ్మ అనుకుని పామును పట్టుకోవడం, అది చేతికి చుట్టుకోవడం, తర్వాత దానిని నోటితో కొరికి చంపడం, స్వల్ప విష ప్రభావంతో పిల్లాడు ఆస్పత్రిపాలై చివరకు ప్రాణాలతో బయటపడటం అంతా నమ్మశక్యంకాని రీతిలో జరిగాయి.
ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం వెస్ట్‌చంపారన్ జిల్లాలోని మొహఛీ బంకాత్వా గ్రామంలో గోవింద్ కుమార్ అనే ఏడాది వయసు పిల్లాడిని తల్లి ఇంటి వరండాలో వదిలేసి సమీపంలో వంటచెరకు సేకరిస్తోంది. అదే సమయంలో పిల్లాడి వైపు ఒక తాచుపాము వచ్చింది. దీనిని బొమ్మగా భావించిన పిల్లాడు పక్కన ఉన్న వస్తువుతో కొట్టాడు. దాంతో అది పిల్లాడి అరచేతికి చుట్టుకుంది. మెత్తగా ఉండటంతో పిల్లాడు అదేదో తినే వస్తువును అనుకుని వెంటనే నోట్లో పెట్టుకుని పరపరా నమిలేశాడు. దీంతో పాము సెకన్లలో చనిపోయింది. అదే సమయానికి అటుగా వచ్చిన పిల్లాడి అమ్మమ్మ మాతేశ్వరీ దేవి .. పిల్లాడి చేతిలో పామును చూసి హుతాశురాలైంది. వెంటనే పిల్లాడిని, పామును వేరుచేసింది. అయితే అప్పుడు హుషారుగా కనిపించిన పిల్లాడు సమయం గడిచేకొద్దీ నీరసించిపోయాడు.
తర్వాత స్పృహకోల్పోయాడు. విషయం తెల్సుకుని పరుగున వచ్చిన పిల్లాడి తల్లి, కుటుంబసభ్యులు వెంటనే పిల్లాడిని దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చేరి్పంచారు. అయితే పిల్లాడి పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే బేఠియా పట్టణంలోని ప్రభుత్వ వైద్య బోధనాస్పత్రికి తరలించారు. హుటాహుటిన పిల్లాడికి అత్యయిక వైద్యం మొదలెట్టి పిల్లాడి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం పిల్లాడు కోలుకుంటున్నాడని, పాము అతడిని కాటువేయలేదని, నోట్లో పెట్టుకుని కొరకడం వల్ల విషం కొంత పాకి నోట్లోకి వెళ్లి ఉంటుందని ఆస్పత్రి సూపరింటెండెంట్ దువాకాంత్ మిశ్రా చెప్పారు.