రెండో డోసు పూర్తైన 9 నెలలకు బూస్టర్‌! 

Booster dose 9 months after the completion of covid vaccination second dose - Sakshi

పార్లమెంటరీ కమిటీకి ఐసీఎంఆర్‌ సూచన 

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్‌ రెండు డోసులు పూర్తి చేసుకున్న 9 నెలల అనంతరం కరోనా టీకా బూస్టర్‌ డోసును ఇవ్వవచ్చని పార్లమెంటరీ కమిటీకి ఐసీఎంఆర్‌(ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌) సూచించింది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు పూర్తి చేసుకున్న 9నెలల తర్వాత అదనపు డోసును ఇవ్వవచ్చని ఐసీఎంఆర్‌ బలరామ్‌ భార్గవ అభిప్రాయపడ్డారు. కోవీషీల్డ్‌ టీకాను డెల్టా ఉత్పరివర్తనాలను ఎదుర్కోవడానికి బూస్టర్‌ డోసుగా ఇవ్వడం వల్ల ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ పెరుగుతుందని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించినట్లు ఐసీఎంఆర్‌ సైంటిస్టుల బృందం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే!

మరోవైపు దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌పై భయాందోళనలు రేకెత్తకుండా జాగ్రత్త వహించాలని మీడియాను భార్గవ కోరారు. ఇప్పటివరకు ఒమిక్రాన్‌ ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెంచలేదన్నారు. ఈ వేరియంట్‌కు కూడా పాత చికిత్సా విధానాలే పనిచేస్తాయన్నారు. బూస్టర్‌ డోసులపై దేశంలో రెండు నిపుణుల బృందాలనుంచి సూచనలు తీసుకుంటామని, అనంతరం నిర్ణయం ప్రకటిస్తామని ఆరోగ్యమంత్రి ప్రకటించారు. దేశంలో 86 శాతం మందికి కనీసం ఒక్కడోసు పూర్తైందన్నారు. ఒమిక్రాన్‌ 50కిపైగా దేశాల్లో కనిపించిందని, దీని ప్రభావాన్ని సైంటిస్టులు పరిశోధిస్తున్నారని చెప్పారు. దేశంలో కోవిడ్‌ టీకాల సంఖ్య, ఒమిక్రాన్‌ కలకలం తదితర అంశాలపై శనివారం కేబినెట్‌ కార్యదర్శి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.   

32కు చేరిన ఒమిక్రాన్‌ కేసులు
దేశంలో కరోనా వైరస్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరిగిపోతున్నాయి. 32కు చేరుకున్నట్లు కేంద్రం శుక్రవారం తెలిపింది. పుణెకు చెందిన మూడున్నరేళ్ల చిన్నారి సహా మహారాష్ట్రలో కొత్తగా ఏడు కేసులు వెలుగులోకి వచ్చాయని కేంద్రం తెలిపింది. ఒమిక్రాన్‌ కేసుల్లో ఎక్కువగా స్వల్ప లక్షణాలే ఉన్నాయని పేర్కొంది. వైద్యపరంగా చూస్తే ఈ కేసులు దేశ ఆరోగ్య వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపింది. అయినప్పటికీ, ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) సూచనల మేరకు అప్రమత్తత కొనసాగిస్తున్నట్లు వివరించింది.

కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్, నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ మీడియాతో మాట్లాడారు. దేశంలో ఇప్పటి వరకు బయటపడిన కేసుల్లో అతి పిన్న వయస్కురాలు పుణె బాలికేనని వారు తెలిపారు. సెకండ్‌ వేవ్‌కు ముందున్న మాదిరిగానే ప్రస్తుతం కూడా ప్రజలు మాస్క్‌ ధరించకుండా నిర్లక్ష్యం ఉంటున్నారని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ కూడా గుర్తించిందని చెప్పారు. ఇదే ధోరణి కొనసాగినట్లయితే మరోసారి ప్రమాదకర జోన్‌లోకి వెళ్లినట్లేనని హెచ్చరించారు. దేశంలోని అర్హులైన వయోజనుల్లో  53.5%మందికి రెండు డోసులు అందాయన్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top