ఉచితంగా మాస్కు ఇస్తాం.. జరిమానా కూడా వేస్తాం

BMC Distribute Free Mask For Mumbai - Sakshi

సాక్షి, ముంబై : ఇకపై ముంబైకర్లు మాస్కు ధరించకపోతే జరిమానా వసూలు చేసి వారికి ఉచితంగా ఓ మాస్కును అందించనున్నట్లు బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఇక్బాల్‌సింగ్‌ చహల్‌ వెల్లడించారు. బహిరంగ ప్రదేశాలలో, సార్వజనిక ప్రాంతాల్లో ముఖానికి మాస్కులు ధరించని వారి నుంచి బీఎంసీ రూ. 200 జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జరిమానా వసూలు చేసనప్పటికీ మళ్లీ మళ్లీ కొందరు ఇలాంటి తప్పిదాలు చేస్తూ మాస్కులు ధరించడంలేదని తెలుసుకున్న బీఎంసీ ఉచితంగా ఒక మాస్కును కూడా అందించాలని నిర్ణయం తీసుకుంది. మంబైకర్లు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని బీఎంసీ సిబ్బంది జనజాగృతి చేస్తున్నారు. (90%సామర్థ్యం ఉండాల్సిందే!)

రూ.10.08 కోట్లు వసూలు... 
కరోనా వైరస్‌ కొందరు సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటే మరోవైపు బీఎంసీకి మాత్రం ఖజానాలోకి జరిమానా సొమ్ము చేరుతోంది. మాస్కులు ధరించని వారి నుంచి వసూలు చేస్తున్న జారిమానా వల్ల ఇప్పటివరకు బీఎంసీ ఖజానాలోకి సుమారు 10.08  కోట్లు వచ్చాయి. ఓ వైపు కరోనా మహమ్మారి కారణంగా వివిధ మాధ్యమాల వల్ల బీఎంసీకి పన్ను రూపంలో రావల్సిన ఆదాయం కొంత మేర తగ్గింది. ఇలాంటి సమయంలో మాస్కు ధరించని  4,85,737 మంది నుంచి జరిమాన రూపంలో ఏకంగా రూ.10,07,81,600 వసూలయ్యాయి. దీంతో బీఎంసీకి ఆర్థికంగా కొంత ఊరట లభించిందని చెప్పవచ్చు. కరోనా వైరస్‌ విస్తరించకుండా ముఖానికి మాస్క్‌ తప్పని ధరించాలని, లేని పక్షంలో రూ.200 జరిమానా వసూలు చేస్తామని బీఎంసీ ఆదేశాలు జారి చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారిని రెండ్‌ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు బీఎంసీ 250 మందితో కూడిన అధికారుల బృందాన్ని నియమించింది. వీరికి తోడుగా బీఎంసీ పారిశుద్ధ్యం శాఖలో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. వీరంతా బహిరంగ ప్రదేశాల్లో, రద్దీ ఉన్న ప్రాంతాలలో మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవడం ప్రారంబించారు. ఇలా ఇప్పటి వరకు 4,85,737 మందిపై చర్యలు తీసుకున్నారు. 

380కిపైగా కంటైన్మెంట్‌ జోన్లు..
కరోనా వైరస్‌ తీవ్రత దీపావళి పండుగకు ముందు వరకు కొంత తగ్గినప్పటికీ తర్వాత మళ్లీ పెరుగుతోందది. ఇలాంటి నేపథ్యంలో బీఎంసీ మరింత అప్రమ త్తమైంది. ముఖ్యంగా కరోనా వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖానికి మస్కులు ధరించడం, తరచు చేతులు కడగడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం చేయాలనే విషయంపై ప్రజ ల్లో జనజాగృతి ప్రారంభించింది. అదేవిధంగా అనవసరంగా రద్దీ చేయవద్దని కోరింది. దీంతోపాటు మాస్కులు ధరించనివారిపై చర్యలు కూడా చేపట్టింది. కాగా, బీఎంసీ ఫిబ్రవరి 3 నుంచి ఇప్పటివరకు నగరంలో 18 లక్షల కోవిడ్‌ పరీక్షలను నిర్వహించింది. కాగా, కోవిడ్‌ –19తో కోలుకు న్న వారి సంఖ్య 2,5300దాటిందని బీఎం సీ తెలిపింది. అయితే గణాంకాల ప్రకారం కోవిడ్‌తో కోలుకున్న రోగుల శాతం 92 నుంచి 91శాతానికి పడిపోయింది. కాగా, కరోనా వ్యాప్తి ఎక్కువ ఉండటంతో నగరం లో 380కిపైగా కంటైన్మెంట్‌ జోన్లు ఉన్నాయని, 4,280 భవనాలకు సీలు వేశామని అధికారులు ఇంతకుముందే తెలిపారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top