తమిళనాడులో నేరగాళ్లకు ఫ్రీ పాస్‌ | BJP Annamalai fumes at Vijay government over rising crime in TN | Sakshi
Sakshi News home page

తమిళనాడులో నేరగాళ్లకు ఫ్రీ పాస్‌

May 26 2026 1:57 PM | Updated on May 26 2026 2:05 PM

BJP Annamalai fumes at Vijay government over rising crime in TN

తమిళనాడు విజయ్‌ ప్రభుత్వానికి హనీమూన్‌ ముగిసినట్లే కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండు వారాలకే రాష్ట్రంలో వరుసగా నేరాలు ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేత అన్నామలై సంచలన ఆరోపణలకు దిగారు.  

తమిళనాడులో  విజయ్‌ ప్రభుత్వానికి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తాజాగా మైనర్లపై జరిగిన అఘాయిత్యాలు ఆయన ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టాయి. మదురైలో మీనాక్షి ఆలయం సమీపంలో 17 ఏళ్ల బాలుడి హత్య, కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ఎన్నికల ముందు భారీ హామీలు ఇచ్చిన విజయ్‌… ఇప్పుడు వరుస ఘటనలపై ఎందుకు కఠినంగా స్పందించడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 

ఈ ఘటనలపై బీజేపీ నేత కే అన్నామలై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “తమిళనాడులో డ్రగ్ దందాదారులు, లైంగిక నేరస్తులు, హంతకులకు ఫ్రీ పాస్ దొరికినట్టుంది. గతం నుంచి రాష్ట్ర పోలీసులు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. కొత్త టీవీకే ప్రభుత్వం ఇంకా సంబరాల మూడ్‌లోనే ఉన్నట్లుంది. ఇప్పుడైనా బయటకు వచ్చి వాస్తవాలను ఎదుర్కొవాలి” అంటూ ఆయన సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్‌ కూడా చిన్నారుల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ కూడా “ఇది తమిళనాడా? లేక ఉత్తరప్రదేశ్‌నా?” అంటూ సెటైర్లు వేశారు. ఎన్నికల ముందు మార్పు తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టవ్యవస్థను అదుపులో పెట్టలేకపోతోందని విమర్శించారు. అన్నాడీఎంకే నేత పళనిస్వామి కూడా మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తారు. “మహిళల రక్షణ ఎక్కడుంది?” అంటూ విజయ్‌ను నిలదీశారు. 

ఇక కోయంబత్తూరు ఘటనపై పరిశ్రమల మంత్రి స్పందించిన తీరు కూడా వివాదానికి దారితీసింది. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో బీజేపీ తీవ్రంగా విమర్శించింది. అనంతరం పోలీసులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఉన్నతాధికారులు చిరునవ్వులు చిందించిన వీడియోలు కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. దీంతో చట్టవ్యవస్థ అంశం ఇప్పుడు విజయ్ ప్రభుత్వానికి తొలి పెద్ద రాజకీయ పరీక్షగా మారిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఈ విమర్శల మధ్య సీఎం విజయ్ మాత్రం ఒక పోక్సో కేసు తీర్పును ఉదాహరణగా చూపిస్తూ.. ప్రభుత్వాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తూత్తుకుడి జిల్లాలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మూడు నెలల్లోనే డబుల్ డెత్ పెనాల్టీ విధించడాన్ని ప్రస్తావిస్తూ… మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోందని తెలిపారు.

అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇప్పుడు విజయ్‌కు అసలైన సవాలు మొదలైందని భావిస్తున్నారు. ఎన్నికల హామీలు ఇవ్వడం ఒకటైతే… చట్టవ్యవస్థను సమర్థంగా నడిపించడం మరో విషయం అని చెబుతున్నారు. భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేస్తుందన్నదే తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement