బర్డ్‌ ఫ్లూ: చికెన్‌ తిందామా.. వద్దా?!

Bird Flu Can You Eat Chicken And Eggs - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ఇంకా అదుపులోకి రాలేదు. మరో వైపు యూకే కొత్త స్ట్రెయిన్‌ వ్యాప్తి ప్రారంభమయ్యింది. ఇప్పటికే భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుండగా.. తాజాగా బర్డ్‌ ఫ్లూ నేనున్నానంటూ భయపెడుతుంది. ఇప్పటికే కేంద్రం 10 రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక బర్డ్‌ ఫ్లూ అనేది జూనోటిక్‌ వైరస్‌. అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. దాంతో ప్రస్తుతం జనాలు చికెన్‌, గుడ్డు తినాలంటే భయపడుతున్నారు.. సందేహిస్తున్నారు. బర్డ్‌ ఫ్లూ వ్యాపిస్తున్న ఈ కాలంలో చికెన్‌, గుడ్లు తినడం సేఫేనా అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇది చదవాల్సిందే.. 

ఇక బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి ప్రారంభం కాగానే ఇలాంటి వార్తలు తెగ ప్రచారం అవుతాయని తెలిసే కేంద్ర పంశు సంవర్ధక మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఓ ట్వీట్‌ చేశారు. చికెన్‌, గుడ్లను తినాలంటే.. ముందుగా వాటిని బాగా ఉడికించాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రత వద్ద.. ఎక్కువ సమయం ఉడకడం వల్ల వైరస్‌ ప్రమాదం తొలుగుతుందన్నారు. ఇక ఇది హీట్‌ సెన్సెటివ్‌ వైరస్‌ కావడం వల్ల గుడ్లను ఉడికించేటప్పడు.. పచ్చసొన, తెల్ల సొన గట్టి పడేవరకు.. మాంసం ఉడికించేటప్పుడు దాని మధ్యలో గులాబి రంగు కనపడనంత వరకు ఉడికించాలని.. అప్పుడే తినాలని తెలిపారు. (చదవండి: అది బర్డ్‌ఫ్లూ కాదు.. )

కలుషితమైన మాంసం ద్వారా బర్డ్‌ ఫ్లూ మానవులకు సంక్రమిస్తుందనే భయాన్ని ప్రభుత్వం తొలగించింది, "భారతదేశంలో, ఈ వ్యాధి ప్రధానంగా వలస పక్షుల ద్వారా వ్యాపిస్తుంది" అని పేర్కొంది, అయితే " బర్డ్‌ ఫ్లూ సోకిన పక్షుల ద్వారా వైరస్‌ మనుషులకు సంక్రమించే ప్రమాదాన్ని తోసిపుచ్చలేము" అన్నారు.

ప్రస్తుతం అధికారులు చనిపోయిన పక్షులను సేకరించి, లాలాజలం, రక్తం, బిందువుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందా.. లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ నమూనాలను సేకరించే సమయంలో వారంతా తప్పక పీపీఈ కిట్లు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక మాంసం అమ్మకదారులకు బర్డ్‌ ఫ్లూ సోకే ప్రమాదం అధికంగా ఉందని.. వారు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. (చదవండి: 120 నాటుకోళ్లు మృతి..బర్డ్‌ ఫ్లూ అనుమానం)

గత కొన్నేళ్లుగా బర్డ్‌ ఫ్లూ మానవులకు సంక్రమించిన దాఖలాలు లేవు. అయితే 1997 లో హాంకాంగ్‌లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ హెచ్‌5ఎన్‌1.. 80 మందికి సోకగా.. ఒకరు చనిపోయారు. ఇక వైరస్ మానవుల నుంచి మానవులకి బదిలీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిపుణులు తెలిపారు.

పక్షుల మధ్య కూడా బర్డ్‌ ఫ్లూ వ్యాప్తిని తనిఖీ చేయడానికి, ప్రభావిత రాష్ట్రాలు పౌల్ట్రీ మార్కెట్లను తాత్కాలికంగా మూసివేసాయి.. వైరస్‌ సోకిన పక్షులను చంపడం ప్రారంభించాయి. పక్షుల దిగుమతిని నిషేధించాయి. జంతుప్రదర్శనశాలలు, అభయారణ్యాల చుట్టూ "బయో-బబుల్స్‌"ని ఏర్పాటు చేశాయి. వ్యవసాయంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో కలుసుకుని దేశంలో జంతువుల వ్యాక్సిన్ల లభ్యతను పరిశీలించింది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top