లవ్‌–కుశ్‌ కోటకు బీటలు! | BIhar All Parties eyes on Love, Kusa vote bank | Sakshi
Sakshi News home page

లవ్‌–కుశ్‌ కోటకు బీటలు!

Nov 6 2025 6:29 AM | Updated on Nov 6 2025 6:29 AM

BIhar All Parties eyes on Love, Kusa vote bank

‘కుశ’ ఓటు బ్యాంకుపైనే బీజేపీ ప్రధానంగా దృష్టి

ఇదే ఓటు బ్యాంకుపై ఆర్‌ఎల్‌ఎం, తేజస్వీ యాదవ్‌ల కన్ను

ఈ రెండు కులాలను ఏకీకరించడంతో నితీశ్‌కు తప్పని కష్టాలు

సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రంలో కుల సమీకరణాలే తిరిగి ప్రధాన అస్త్రాలుగా మారుతున్నాయి. అజెండాలు, హామీల కంటే సామాజిక సమీకరణాల చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అధికార, విపక్ష కూటములు వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. 

గత రెండు దశాబ్దాలుగా ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు రాజకీయ బ్రహ్మాస్త్రంగా, అజేయశక్తిగా నిలిచిన ‘లవ్‌–కుశ్‌‘ సమీకరణం ఇప్పుడు నెమ్మదిగా నీరుగారిపోతోందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఒకప్పుడు నితీశ్‌ ఏకఛత్రాధిపత్యంలో ఉన్న ఈ బలమైన ఓటు బ్యాంకు నేడు బీజేపీ, ఆర్జేడీ, ఇతర పక్షాల ఎత్తుగడలతో ముక్కలవుతోంది. ఈ వర్గాల ఓట్ల చీలికే ఈ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

అసలు ఏమిటీ ‘లవ్‌–కుశ్‌’? 
‘లవ్‌–కుశ్‌‘ అనేది బిహార్‌లోని రెండు ప్రధాన ఓబీసీ కులాల రాజకీయ కూటమికి పెట్టిన పేరు. ‘లవ్‌’ కుర్మి కులానికి ప్రతీక. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఈ కులానికి చెందిన నేత. ‘కుశ’ అనేది కుష్వాహా కులానికి గుర్తు. వీరిని కోయిరీ అని స్థానికంగా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీరాముడి కుమారులు లవకుశులు. తాము వీరి వంశీయులమని ఈ లవ్, కుష్వాహా కులాలు బలంగా విశ్వసిస్తున్నాయి. 

ఈ పౌరాణిక బంధాన్నే 1990లలో నేతలు తమ రాజకీయ సమీకరణంగా విజయవంతంగా మలిచారు. 2023 కుల గణన నివేదిక ప్రకారం బిహార్‌ జనాభాలో కుర్మి కులస్తులు 2.87 శాతంకాగా కుష్వాహా వర్గీయులు 4.21 శాతం దాకా ఉన్నారు. మొత్తం కలిపితే వీరి జనాభా 7.08 శాతం. సంక్లిష్టమైన బిహార్‌ రాజకీయంలో ఈ 7 శాతం ఓటు బ్యాంక్‌ కూడా ఏ కూటమికైనా గెలుపు, ఓటములను నిర్దేశించగల ‘స్వింగ్‌‘ శక్తిగా ఎదిగింది. 

లాలూ ‘ముస్లిం–యాదవ్‌’ ఫార్ములాకి విరుగుడు
1990లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ముఖ్య మంత్రి అయ్యాక ఆయన ముస్లిం–యాదవ్‌ సమీకరణాన్ని పటిష్టం చేసుకున్నారు. రాష్ట్ర జనాభాలో 14.26 శాతమున్న యాదవులు, 17.7 శాతమున్న ముస్లిం వర్గాలను కలిపితే అది దాదాపు 32 శాతం బలమైన ఓటు బ్యాంకుగా మారింది. లాలూ పాలనలో యాదవులకే అగ్రతాంబూలం దక్కుతోందని, ఇతర వెనుకబడిన కులాలైన కుర్మి, కుష్వాహాలు రాజకీయంగా అణచివేతకు గురవుతున్నారనే అసంతృప్తి ఒక్కసారిగా ఎక్కువైంది. 

ఈ పరిణామాలను పసిగట్టి ఆనాడు జార్జ్‌ ఫెర్నాండెజ్‌తో కలిసి సమతా పార్టీలో ఉన్న నితీశ్‌ కుమార్‌ వెనువెంటనే లాలూకు వ్యతిరేకంగా యాదవేతర ఓబీసీలను ఏకం చేయడం మొదలెట్టారు. ఇందులో భాగంగానే 1994లో పట్నాలోని గాంధీ మైదాన్‌లో నితీశ్‌ కుమార్‌ భారీ ‘కుర్మి చేతనా ర్యాలీ’ నిర్వహించారు. ఇది లాలూ ఆధిపత్యానికి వ్యతిరేకంగా కుర్మిల రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ ర్యాలీతో కుర్మి (లవ్‌), కుష్వాహా (కు‹శ్‌) కులాల ఐక్యతకు గట్టి పునాది పడింది. 

నితీశ్‌ ‘అజేయ’ ప్రస్థానానికి బీటలు
నితీశ్‌ కుమార్‌ దాదాపు రెండు దశా బ్దాలుగా బిహార్‌ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నేతగా కొనసాగడానికి ఈ 7 శాతం ‘లవ్‌–కుశ్‌’ ఓటు బ్యాంక్‌ సైతొ ఒక ప్రధాన కారణం. ఈ ‘లవ్‌–కుశ్‌’ పునాది పైనే నితీశ్‌ కుమార్‌ 36 శాతమున్న అతి వెనుకబడిన తరగతు (ఈబీసీ)లను, మహాదళితులను ఏకం చేసి ఒక బలమైన సామాజిక కూటమిని నిర్మించారు. బీజేపీ వంటి మిత్రపక్షాల మద్దతు దీనికి అదనపు బలంగా మారింది. 

నితీశ్‌ కుమార్‌ ఎన్‌డీఏ కూటమిలో ఉన్నా, మహాగఠ్‌బంధన్‌లో ఉన్నా ఆయనతో ఈ రెండు కూటములు బేరసారాలు జరపడానికి ఈ ‘లవ్‌–కుశ్‌’‘ ఓట్లే కారణం. ఈ ఓట్లు తన వ్యక్తిగత చరి ష్మాకే బదిలీ అవుతాయి తప్ప కూటమిలోని బీజేపీ వంటి ఏ ఇతర పార్టీకీ బదిలీకావని ఆయన పలుమార్లు నిరూపించగలిగారు. గత దశాబ్ద కాలంగా ఈ పటిష్టమైన ఓటు బ్యాంకును చీల్చడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నా యి. 

‘లవ్‌’ ఓటు బ్యాంకులో ఎక్కువ భాగం అంటే దాదాపు 2.87 శాతం మంది ఓటర్లు ఇప్పటికీ నితీశ్‌ వైపే ఉన్నారు. కానీ సంఖ్యాపరంగా పెద్దదైన కుష్వాహా(4.21 శాతం) ఓటు బ్యాంకు కోసం ఇప్పుడు నలుగురు ప్రధాన నేతలు పోటీ పడుతు న్నారు. ‘లవ్‌–కుశ్‌’ ఓట్లపై నితీశ్‌ ఆధారప డటాన్ని తగ్గించడానికి బీజేపీ సొంతంగా పావులు కదిపింది. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సమ్రాట్‌ చౌదరిని బిహార్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, డెప్యూటీ సీఎంగా నియమించింది. ఇది ‘కుష్‌‘ ఓటు బ్యాంకును నితీశ్‌ నుంచి వేరు చేసి, నేరుగా బీజేపీ వైపు తిప్పుకోవాలనే స్పష్టమైన రాజకీయ వ్యూహంగా మారింది.  

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ కూడా తన తండ్రి ‘ముస్లిం–యాదవ్‌’ సమీకరణం దాటి అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని నిర్ణయించుకున్నారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జే డీ అనేక మంది కుష్వాహా, కుర్మి అభ్య ర్థులకు టికెట్లు ఇచ్చింది. నితీశ్‌పై అసంతప్తిగా ఉన్న ‘లవ్‌–కుశ్‌’ ఓట్లను ఆకర్షించి, తన ‘ముస్లిం–యాదవ్‌ ’కూటమికి జోడించుకోవాలని తేజస్వీ పెద్ద ప్రణాళిక వేశారు. ఆర్‌ఎల్‌ఎం నేత ఉపేంద్ర కుష్వాహా సైతం నితీశ్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నారు. 

నితీశ్‌తో విభేదించి రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్పీ) స్థాపించడం, 2014లో ఎన్డీఏలో చేరి కేంద్ర మంత్రి కావడం, తిరిగి 2021లో పార్టీని జేడీ(యూ)లో విలీనం చేయడం, మళ్లీ 2023లో రాష్ట్రీయ లోక్‌ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) స్థాపించి ఎన్డీఏలో చేరడం.. ఇలా ఆయన ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కారాకాట్‌ నుంచి ఓడిపోవడం, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ నామమాత్రపు సీట్లు కేటాయించడంతో ఆయన బలం తగ్గింది. కానీ ఆయనకు ఇప్పటికీ ‘కు‹శ్‌’ ఓట్లను కొంతమేర చీల్చగల శక్తియుక్తులు ఉన్నాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఈ పరిణామాలు నితీశ్‌ బలాలను ఏ మేరకు దెబ్బకొడతాయో 14న ఎన్నికల ఫలితాలతో తేలిపోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement